శ్రీశైలం మహాక్షేత్రంలో ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, అర్చకులు, అధికారులు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు దేశ శాంతి, సౌభాగ్యాలు, సకాలంలో వర్షాలు కురవడం, ప్రకృతి వైపరీత్యాలు నివారించబడటం, పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ ప్రత్యేక సంకల్పాన్ని పఠించారు.
అలాగే ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, అకాల మరణాలు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు వంటి అనర్థాలు సంభవించకుండా దేశం సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం భక్తుల హర్షధ్వానాల మధ్య శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణరథోత్సవం ఘనంగా నిర్వహించబడింది.