హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర హరిప్రసాద్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాన్ని అప్రమత్తం చేసినప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
గతంలో కరోనా మహమ్మారి సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని హరిప్రసాద్ పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఎల్‌నినోపై కేంద్రం సూచనలు చేసినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.
అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రిటైర్డ్ ఇంజినీర్లపై చేసిన వ్యాఖ్యల కంటే, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టి సారించాలని హరిప్రసాద్ అన్నారు.