హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్‌కు చెందిన ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే విశ్వసనీయ ఫిర్యాదుల నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ బృందాలు ఏకకాలంలో పలుచోట్ల తనిఖీలు చేపట్టాయి.
ఏసీబీ డీఎస్పీ మాజిద్ ఖాన్ పర్యవేక్షణలో మొత్తం 15 ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. మైత్రివనంలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంతో పాటు గచ్చిబౌలిలోని సుమధుర టవర్స్‌లో ఉన్న బచ్చు రవీందర్ నివాసంలో అధికారులు రికార్డులు, పత్రాలను పరిశీలిస్తున్నారు.
అంతేకాకుండా రవీందర్‌కు చెందిన సన్నిహితులు, బంధువులు, అనుచరుల ఇళ్లలో కూడా ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన ఆధారాల కోసం అధికారులు పత్రాలు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సోదాలు పూర్తయ్యాక స్వాధీనం చేసుకున్న ఆస్తులు, నగదు, పత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ వెల్లడించే అవకాశం ఉంది.