ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

తూర్పుగోదావరి జిల్లాలోని చారిత్రాత్మక ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. బ్యారేజీ పునరుద్ధరణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం గేట్ల వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి, ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సూచనల మేరకు బ్యారేజీలో మిగిలిన 117 గేట్లను అత్యాధునిక సాంకేతికతతో మార్చే పనులను ప్రభుత్వం ప్రారంభించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్యకాలంలో 58 కొత్త గేట్లు అమర్చిన విషయాన్ని అధికారులు సీఎంకు వివరించారు.

మిగిలిన 117 గేట్ల బిగింపు పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి మొత్తం ఆధునీకరణ పనులు పూర్తవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.