క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్, శాండల్‌వుడ్‌లలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి పవిత్ర లోకేష్ వ్యక్తిగత జీవితం గత కొంతకాలంగా సోషల్ మీడియాలో నిరంతరం చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా సీనియర్ నటుడు వీకే నరేష్‌తో ఆమె బంధం, సహజీవనంపై ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే, చాలా మందికి పవిత్ర లోకేష్ గతంలో కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్‌తో ఉన్న రిలేషన్‌షిప్ మాత్రమే తెలుసు. కానీ, వీరందరికంటే ముందు పవిత్ర లోకేష్‌కు ఒక మొదటి వివాహం జరిగిందనే అసలు గుట్టును ఆమె తల్లి పార్వతి లోకేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టడం చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది.
పవిత్ర లోకేష్ తల్లి వెల్లడించిన వివరాల ప్రకారం.. సుచేంద్ర ప్రసాద్‌తో బంధంలోకి వెళ్ళడానికి కంటే ముందే, అంటే 2007లో పవిత్రకు మొదటి వివాహం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన సూర్య అనే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో ఆమెకు పెళ్లి జరిపించారు. ఇది ప్రేమ వివాహం కాదు, బెంగళూరులో వారి పక్క ఇంట్లో ఉండే ఒకరు ఈ సంబంధాన్ని తీసుకురావడంతో పెద్దలే కుదిర్చిన వివాహం. హైదరాబాద్‌లోని ఒక దేవాలయంలో సాంప్రదాయబద్ధంగా ఈ పెళ్లి వేడుక జరిగింది. కానీ ఎంతో ఆశతో అడుగుపెట్టిన ఆ వైవాహిక బంధం కనీసం రెండు నెలలు కూడా నిలవలేదు.
ఆ మొదటి పెళ్లి జీవితం కాదు.. నరకం అంటూ పవిత్ర తల్లి పార్వతి లోకేష్ విస్తుపోయే నిజాలను పంచుకున్నారు. పెళ్లయిన కొత్తలోనే సదరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పవిత్ర లోకేష్‌పై విపరీతమైన అనుమానం పెంచుకునేవాడని, ఆమె సినిమాల్లో నటించే సీన్లను చూస్తూ వేధించేవాడని తెలిపారు. అంతటితో ఆగకుండా, ఆమెకు ఉన్న సొంత కారును బలవంతంగా అమ్మించేయడమే కాకుండా, పెళ్లికి వచ్చిన వస్తువులను, ఆమె పేరు మీద ఉన్న బాండ్లను కూడా క్యాష్ చేసుకుని వేధించాడని పేర్కొన్నారు. ఈ నరకప్రాయమైన వేధింపులను భరించలేకనే పవిత్ర లోకేష్ కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఆ భర్తకు దూరమై, ఆ బంధం నుండి బయటపడిందని ఆమె తల్లి ఎమోషనల్ అయ్యారు.