తెలంగాణ లో జపాన్ భారీ పెట్టుబడులు..! అగ్రికల్చర్ టెక్నాలజీతో..

తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చే దిశగా స్థానిక ప్రజాప్రతినిధులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే, తాజాగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన జపాన్ దేశంలోని హిరోషిమాకు చెందిన ప్రజాప్రతినిధుల బృందంతో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శాసనమండలి కమిటీ హాల్‌ను సందర్శించిన ఈ విదేశీ ప్రతినిధులకు మన రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణాన్ని ఆయన వివరించారు.

 

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణలో జపాన్ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని గుర్తుచేశారు. కేవలం పరిశ్రమల స్థాపనే కాకుండా, ఇక్కడి యువతకు ఉపాధి దొరికేలా నైపుణ్య శిక్షణ (స్కిల్ డెవలప్‌మెంట్) అందించాలని కోరారు.

 

ముఖ్యంగా అగ్రికల్చర్ టెక్నాలజీ (వ్యవసాయ సాంకేతికత), వైద్య రంగాల్లో రెండు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. జపాన్ సాంకేతికత ఇక్కడి రైతులకు, వైద్య రంగానికి ఎంతో ప్లస్ అవుతుందని, దీనివల్ల పరస్పర సహకారం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ చర్చలు మరిన్ని పెట్టుబడులకు దారితీస్తాయని భావిస్తున్నారు.