రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో గుండెలవిసే హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా అగ్నికీలలు చెలరేగడంతో వారంతా కారులోనే సజీవదహనమయ్యారు. జిల్లాలోని శ్రీరాంపుర గ్రామం సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం సంభవించింది. మృతుల్లో స్థానిక కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ రామ్ సింగ్ చౌదరితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్ సింగ్ చౌదరి తల్లి పూసీ దేవికి తెల్లవారుజామున అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో, ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఎస్‌యూవీ (SUV) కారులో బయలుదేరారు. కారులో రామ్ సింగ్, ఆయన భార్య సూర్యగ్యాన్ దేవి, తల్లి పూసీ దేవి, మేనకోడలు మహిమ ఉన్నారు. అయితే, నివాసానికి కేవలం అరకిలోమీటరు దూరంలోనే ప్రధాన రహదారిపై వెళ్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించి అది అగ్నిగోళంగా మారింది. కారు డోర్లు సెంట్రల్ లాక్ అయిపోవడంతో లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారని, క్షణాల వ్యవధిలోనే మృత్యువు వారిని కబళించిందని స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే అజ్మీర్ ఎస్పీ హర్షవర్ధన్ అగర్వాల్ నేతృత్వంలోని పోలీసు బృందం, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసినప్పటికీ.. అప్పటికే కారు పూర్తిగా అస్థిపంజరంగా మారిపోయింది. ప్రాథమికంగా ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదంగా భావించినప్పటికీ, మృతదేహాలపై ఉన్న కొన్ని గాయాలు, ఇంటి వద్ద లభించిన రక్తపు మరకల ఆధారంగా పోలీసులు దీనిని హత్య కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ (FSL) బృందాలు రంగంలోకి దిగి నమూనాలను సేకరించాయి.