ఐఐపీ లెక్కింపులో కేంద్రం భారీ మార్పులు: మారనున్న బేస్ ఇయర్, మారిన వస్తువుల జాబితా

దేశ పారిశ్రామిక వృద్ధి రేటును అంచనా వేసే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (IIP) లెక్కింపు పద్ధతిలో కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) కీలక మార్పులు చేస్తోంది. ఇప్పటివరకు 2011-12 ఆర్థిక సంవత్సరాన్ని ఆధారిత సంవత్సరంగా (బేస్ ఇయర్) తీసుకుని ఐఐపీని లెక్కిస్తుండగా, దానిని 2022-23 ఆర్థిక సంవత్సరానికి మారుస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో గత దశాబ్ద కాలంలో వచ్చిన నిర్మాణాత్మక మార్పులు, సాంకేతిక పురోగతిని ప్రతిబింబించేలా ఈ కొత్త సిరీస్‌ను రూపొందించారు. ఈ సవరించిన సరికొత్త విధానాన్ని జూన్ 1, 2026 నుండి అధికారికంగా అమలు చేయనున్నారు.

ఈ కొత్త లెక్కింపు విధానంలో వస్తువుల జాబితాను (ఐటమ్ బాస్కెట్) గణనీయంగా విస్తరించారు. ప్రస్తుతం ఐఐపీలో 407 వస్తు సమూహాలు (Item Groups) ఉండగా, వాటి సంఖ్యను 463కి పెంచారు. కాలంచెల్లిన, వాడకం తగ్గిన కిరోసిన్, ఫ్లోరోసెంట్ ట్యూబ్‌లు (CFLs), ఇంకాండిసెంట్ బల్బులు, సైకిల్ టైర్లు వంటి 64 కేటగిరీలను ఈ జాబితా నుండి తొలగించారు. వీటికి బదులుగా ఆధునిక కాలంలో వినియోగం పెరిగిన సీసీటీవీ (CCTV) కెమెరాలు, క్రెడిట్/డెబిట్ కార్డులు, మెడికల్ స్టెంట్లు, వ్యాక్సిన్లు, ల్యాప్‌టాప్‌లు మరియు ఎయిర్‌క్రాఫ్ట్ భాగాల వంటి 120 కొత్త వస్తు సమూహాలను ఐఐపీ పరిధిలోకి తీసుకువచ్చారు.

మరోవైపు, పరిశ్రమల పరిధిని కూడా కేంద్రం మరింత లోతుగా వర్గీకరించింది. మైనింగ్, తయారీ, విద్యుత్ రంగాలతో పాటుగా.. గ్యాస్ సరఫరా, నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ మరియు వ్యర్థాల నిర్వహణ (Waste Management) వంటి విభాగాలను కొత్తగా చేర్చారు. అలాగే, ఇంధన రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యుత్ రంగాన్ని ‘పునరుత్పాదక ఇంధనం’ (Renewable), ‘సాంప్రదాయ ఇంధనం’ (Non-renewable) అని రెండు వేర్వేరు సబ్-ఇండెక్స్‌లుగా విభజించి లెక్కిస్తారు. పారిశ్రామిక వేగంలో ఖచ్చితమైన ట్రెండ్స్‌ను త్వరగా గుర్తించడానికి వీలుగా.. స్థిరమైన బేస్ ఇయర్‌తో పాటుగా, వార్షిక ప్రాతిపదికన వెయిటేజీలను మార్చుకునే వీలుండే ‘చైన్-లింక్డ్’ (Chain-linked) విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని సాంకేతిక సలహా కమిటీ సిఫార్సు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *