హైడ్రా మెగా ఆపరేషన్: ఒక్కరోజులోనే రూ.4,117 కోట్ల విలువైన భూముల స్వాధీనం, కంచె ఏర్పాటు

హైదరాబాద్ మహానగరంలో భూకబ్జారాయుళ్లు, చెరువులను మింగేస్తున్న అక్రమ నిర్మాణదారులపై హైడ్రా (HYDRAA) మరోసారి ఉక్కుపాదం మోపింది. ఐటీ కారిడార్ పరిధిలోని అత్యంత విలాసవంతమైన, ఖరీదైన ప్రాంతాలైన కోకాపేట, ఖానామెట్, భరత్‌నగర్ పరిసరాల్లో అధికారులు ఏకకాలంలో భారీ మెగా ఆపరేషన్ నిర్వహించారు. కేవలం ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో నాలుగు ప్రధాన ప్రాంతాల్లో కబ్జాకు గురైన రూ.4,117 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను, చెరువు భూములను విముక్తి కల్పించి వాటి చుట్టూ రక్షణ కంచెలను ఏర్పాటు చేశారు.

ఈ భారీ ఆపరేషన్‌లో బడా రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలు బట్టబయలయ్యాయి. కోకాపేట కొత్తచెరువు ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలోని ఒక ఎకరాకు పైగా స్థలాన్ని ఆక్రమించి, విల్లాల నివాసితుల కోసం నిర్మించిన లగ్జరీ గార్డెన్లు, బాస్కెట్‌బాల్ కోర్టులు, ఆట స్థలాలను హైడ్రా బలగాలు బుల్డోజర్లతో నేలమట్టం చేశాయి. అలాగే కోకాపేట పెద్దచెరువు పరిధిలో వివిధ బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థలు ఆక్రమించిన దాదాపు 22 ఎకరాల స్థలాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఈ ఒక్క కోకాపేట ప్రాంతంలోనే కాపాడిన భూమి మార్కెట్ విలువ రూ.3 వేల కోట్లకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.

మరోవైపు, ఖానామెట్ పరిధిలోని ఈదులకుంట చెరువును ఏకంగా గూగుల్ మ్యాప్స్ నుంచే మాయం చేసేందుకు కబ్జాదారులు వేసిన పక్కా స్కెచ్‌ను హైడ్రా భగ్నం చేసింది. చెరువులోకి వచ్చే వరద నీటి కాలువను మళ్లించి, ఎండిపోయినట్లు చేసిన ఆ 6.50 ఎకరాల చెరువు స్థలాన్ని శాటిలైట్ చిత్రాల ఆధారంగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.600 కోట్లు ఉంటుంది. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులు, క్షేత్రస్థాయి పరిశీలనల అనంతరం చేపట్టిన ఈ మెగా డ్రైవ్‌తో అక్రమ నిర్మాణదారులు, రియల్టర్లలో వణుకు మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *