గోదావరిలో దుర్వాసన.. స్పాట్‌లోనే నీటి పరీక్షలకు ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి నది నీటి నాణ్యతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా గోదావరి నది నీరు కలుషితమవడమే కాకుండా దుర్వాసన వస్తోందన్న స్థానికుల ఫిర్యాదులపై ఆయన తక్షణమే స్పందించారు. నది పరివాహక ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన, అక్కడికక్కడే అధికారులను పిలిపించి నీటి నమూనాలను సేకరించాలని ఆదేశించారు.

“గోదావరి నీరు మనకు జీవనాధారం.. ఇందులో దుర్వాసన రావడం ఏంటి? ఇక్కడే, ఇప్పుడే టెస్ట్ చెయ్” అంటూ పవన్ కళ్యాణ్ కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల నుంచి వస్తున్న రసాయన వ్యర్థాలు, మురుగునీరు నేరుగా నదిలోకి కలవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ప్రాథమికంగా గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే ఊరుకునేది లేదని, కాలుష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు గోదావరి నీటి శాంపిల్స్‌ను సేకరించి మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన వెంటనే కాలుష్య నివారణకు శాశ్వత చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నదుల పవిత్రతను, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో కూటమి ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడదని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *