తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి గాను రాష్ట్రానికి రూ.9,968 కోట్ల భారీ గ్రాంట్‌ను మంజూరు చేసింది. ఈ నిధులు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు చేరుతాయని, అక్కడ నుండి పది పనిదినాల్లోగా సంబంధిత స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ భారీ కేటాయింపులతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా ప్రజా పరిషత్‌ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు పల్లెల రూపురేఖలు మారనున్నాయి.
కేంద్రం విడుదల చేసిన ఈ నిధుల వినియోగంపై స్పష్టమైన, కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిధులను కేవలం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల నిర్మూలన, గ్రామీణ రహదారుల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు వంటి ప్రజా ఉపయోగ పనులకే ఖర్చు చేయాలని ఆదేశించింది. స్థానిక సంస్థల పరిధిలోని ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు లేదా ఇతర పరిపాలనా పరమైన ఖర్చుల కోసం ఈ నిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదని కేంద్ర ఆర్థిక శాఖ కఠినమైన నిబంధనలు విధించింది.
ఈ నిధుల పంపిణీలో గ్రామ పంచాయతీలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ 80 శాతం నిధులను నేరుగా వాటికే కేటాయించారు. మిగిలిన 10 శాతం మండల పరిషత్‌లకు, మరో 10 శాతం జిల్లా పరిషత్‌లకు ఏటా రెండు విడతలుగా (జూన్, అక్టోబర్ నెలల్లో) అందనున్నాయి. అయితే, నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచేందుకు కేంద్రం ప్రత్యేక నిబంధనలు పెట్టింది. స్థానిక సంస్థలు తమ ఆడిట్ నివేదికలను ఆన్‌లైన్‌లో పొందుపరచడంతో పాటు, నిధుల ఖర్చుకు సంబంధించిన ప్రతి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వ ‘ఇ-గ్రామ్‌స్వరాజ్’ పోర్టల్‌లో నమోదు చేయడం తప్పనిసరి చేసింది. దుర్వినియోగానికి తావులేకుండా నిఘాను మరింత పటిష్ఠం చేసింది.