రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, మరియు ఎల్పీజీ (వంటగ్యాస్) కొరత ఏర్పడిందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) తీవ్రంగా ఖండించాయి. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, రాష్ట్రవ్యాప్తంగా ఇంధన సరఫరా అత్యంత సాధారణంగా, స్థిరంగా సాగుతోందని చమురు సంస్థల ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను, వదంతులను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
ప్రస్తుత వేసవి సీజన్ డిమాండ్‌కు అనుగుణంగా ఇంధన నిల్వలు పుష్కలంగా అందుబాటులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మే నెల మొదటి రెండు వారాల్లోనే పెట్రోల్ సరఫరాలో 14.2 శాతం, డీజిల్ సరఫరాలో 15.7 శాతం వృద్ధి నమోదైందని, ఎక్కడా బంకుల్లో స్టాక్ కొరత లేదని తెలిపారు. పెరిగిన వినియోగానికి తగ్గట్టుగా రవాణా వ్యవస్థను మరింత వేగవంతం చేసి, నిరంతరాయంగా సరఫరా జరిగేలా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు వంటగ్యాస్ సరఫరా కూడా పూర్తిగా సాధారణ స్థితిలోనే ఉందని కంపెనీలు తెలిపాయి. ఈ నెలలో ఇప్పటికే లక్షలాది గృహావసర ఎల్పీజీ సిలిండర్లను వినియోగదారులకు విజయవంతంగా డెలివరీ చేశామని, ఎక్కడా ‘పానిక్ బుకింగ్స్’ చేయాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన ఓటీపీ ఆధారిత ‘డెలివరీ అథెంటికేషన్ కోడ్’ (DAC) విధానానికి వినియోగదారులు సహకరించాలని, డిజిటల్ పద్ధతుల్లోనే బుకింగ్స్ చేసుకోవాలని చమురు సంస్థలు కోరాయి.