కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బాటలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులకు, పించనుదారులకు భారీ ఊరటనిస్తున్నాయి. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కరువు భత్యం (డియర్నెస్ అలవెన్స్ – DA) పెంచుతూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు 2 శాతం డీఏ పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ తాజా పెంపుతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల కరువు భత్యం ప్రస్తుతమున్న 58 శాతం నుండి 60 శాతానికి చేరుకుంది. ఈ నూతన వేతన సవరణ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 16 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు రిటైర్డ్ పెన్షనర్లకు నేరుగా లబ్ధి చేకూరనుంది. సవరించిన ఈ కొత్త డీఏ మార్పులు మే నెల జీతంతో కలిపి జూన్ మొదటి వారంలో ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి.
మరోవైపు, ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చేలా ఈ పెరిగిన డీఏను వర్తింపజేయనున్నారు. దీంతో జనవరి నుండి ఏప్రిల్ వరకు ఉన్న నాలుగు నెలల బకాయిలను (అరైర్స్) ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కేవలం ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా ఇటీవల తమిళనాడు, ఒడిశా, బీహార్ మరియు కర్ణాటక వంటి పలు రాష్ట్రాలు కూడా తమ ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయాలు తీసుకోవడంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలోకి భారీగా నగదు చేరనుంది.