ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధిక స్థాయికి చేరడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.113 మార్కును తాకడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విపరీతంగా పెరిగిన ఈ ధరల వల్ల సామాన్య ప్రజలపై మోయలేని జీవన వ్యయ భారం పడుతోందని, తక్షణమే స్పందించి లీటరుపై రేట్లను తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు విజయసాయిరెడ్డి ఒక కీలకమైన సలహా ఇచ్చారు. ఏపీలో పన్నుల భారం ఎక్కువగా ఉండటం వల్ల పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలతో పోలిస్తే ఇక్కడ ఇంధన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని గుర్తుచేశారు. పొరుగు రాష్ట్రాల వ్యాపార, పన్నుల విధానాలను ఫాలో అవ్వాలని హితవు పలికారు. అక్కడ రేట్లు తక్కువగా ఉండటంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు, రవాణా వాహనదారులు పక్క రాష్ట్రాల్లోనే ఇంధనాన్ని నింపుకుంటున్నారని, దీనివల్ల ఏపీ ప్రభుత్వానికే భారీగా ఆదాయ లీకేజీ జరిగి నష్టం వాటిల్లుతోందని విశ్లేషించారు.
కేవలం మాటలకే పరిమితం కాకుండా, పొరుగు రాష్ట్రాల తరహాలో పన్నుల రేట్లను హేతుబద్ధీకరించి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ధరల తగ్గింపు ద్వారా అటు ప్రజలకు ఉపశమనం లభించడంతో పాటు, ఇటు రాష్ట్ర సరిహద్దుల్లో కోల్పోతున్న ఇంధన అమ్మకాల రాబడిని తిరిగి సొంతం చేసుకోవచ్చని ప్రభుత్వానికి సూచించారు. పెరుగుతున్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం మరియు ఈవీ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తరించడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.