కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, అలవెన్సులు మరియు పెన్షన్ల సవరణల కోసం ఉద్దేశించిన 8వ వేతన సంఘం (8th CPC) తన కసరత్తును మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా వివిధ ఉద్యోగ సంఘాలు, భాగస్వామ్య పక్షాల నుంచి వినతులు, సూచనలతో కూడిన మెమోరాండం (అభ్యర్థనలు) సమర్పించే గడువును మే 31, 2026 వరకు పొడిగిస్తూ పే కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ, ఉద్యోగుల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ఈ అవకాశాన్ని కల్పించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంఘాలు తమ డిమాండ్లను అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో సమర్పించడానికి ఈ పొడిగింపు ఎంతో ఊరటని కలిగించే అంశం.
మరోవైపు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు మరియు స్థానిక ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను సేకరించేందుకు 8వ వేతన సంఘం సభ్యులు మే 18, 19 తేదీల్లో (సోమ, మంగళవారాల్లో) రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ఈ ఉన్నత స్థాయి కమిటీ.. హైదరాబాద్ వేదికగా తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రైల్వే, డిఫెన్స్ మరియు పెన్షనర్ల అసోసియేషన్ల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ పర్యటనలో స్థానిక భాగస్వామ్య పక్షాలు తమ జీతభత్యాల సవరణలు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపుదల వంటి కీలక డిమాండ్లను కమిషన్ ముందు ఉంచేందుకు సిద్ధమవుతున్నాయి.
ఈ 8వ వేతన సంఘం నిర్ణయాల వల్ల దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మందికి పైగా పెన్షనర్లు నేరుగా ప్రయోజనం పొందనున్నారు. ఉద్యోగ సంఘాలు ప్రస్తుతం కనీస వేతనాన్ని భారీగా పెంచడంతో పాటు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను కూడా గణనీయంగా సవరించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. న్యూ ఢిల్లీలో రైల్వే, రక్షణ శాఖల యూనియన్లతో ప్రాథమిక చర్చలు ముగించుకున్న పే కమిషన్.. ఇప్పుడు హైదరాబాద్ పర్యటన ద్వారా దక్షిణాది రాష్ట్రాల ఉద్యోగుల నూతన అంచనాలను, సమస్యలను విశ్లేషించనుంది. తదనంతరం జూన్ మొదటి వారంలో జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలలో కూడా ఈ బృందం పర్యటించి తన తుది నివేదిక రూపకల్పనకు అవసరమైన సమాచారాన్ని సేకరించనుంది.