తేది:11-04-2026 TSLAWNEWS మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గాభవాని.
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో అడ్వకేట్స్ అసోసియేషన్ హాల్లో భారతదేశ మహోన్నత సామాజిక సంస్కర్త మహాత్మ జ్యోతిరావ్ గోవింద్రావ్ ఫూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ భీమపాక నాగేష్ విచ్చేసి మహాత్మ ఫూలే జీవిత విశేషాలు, ఆయన చేసిన సామాజిక సంస్కరణలు, సమానత్వం కోసం చేసిన పోరాటం గురించి న్యాయవాదులకు విపులంగా వివరించారు. సమాజంలో ఉన్న కుల వివక్ష, అన్యాయాలు, అణచివేతలపై ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ, విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఫూలే కృషిని ప్రస్తావించారు.
సామాజిక ప్రజాస్వామ్యానికి పునాది వేసిన గొప్ప సంస్కర్తగా, అణగారిన వర్గాల చైతన్యానికి మార్గదర్శకుడిగా మహాత్మ ఫూలే భారతదేశ చరిత్రలో చిరస్మరణీయులుగా నిలిచారు. మహిళల విద్యాభివృద్ధి, సమానత్వ సమాజ నిర్మాణం కోసం చేసిన అపార సేవలకు గుర్తింపుగా ఆయనకు “మహాత్మ” బిరుదు లభించింది. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అనే విలువలను సమాజంలో నెలకొల్పేందుకు ఆయన జీవితాంతం కృషి చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మహాత్మ ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మ ఫూలే ఆశయాలు, ఆలోచనలు నేటి సమాజానికి మార్గదర్శకాలు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వం, సామాజిక న్యాయం, మానవత్వ విలువలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత.మహాత్మ జ్యోతిరావ్ ఫూలే కి వినమ్ర నివాళులు తెలిపారు.