అలహాబాద్ హైకోర్టులో కీలక పరిణామం..! న్యాయమూర్తి యశ్వంత్‌వర్మ రాజీనామా..

అలహాబాద్ హైకోర్టులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపినట్లు తెలుస్తోంది. అభిశంసన ప్రక్రియ నేపథ్యంలో పదవికి రాజీనామా చేసినట్టు చెబుతున్నారు.

 

అలహాబాద్ హైకోర్టులో కీలక పరిణామం

 

2025 మార్చి 14న ఢిల్లీలో జస్టిస్‌ యశ్వంత్‌వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన నివాసంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆయన ఇంటి నుంచి భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. దీనిపై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు జడ్జీల కమిటీ.

 

జస్టిస్‌ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. మే 9న అప్పటి సీజేఐ, జస్టిస్‌ యశ్వంత్‌వర్మను అభిశంసించి, పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతికి, ప్రధానికి సిఫార్సు చేశారు. దీనిపై రాష్ట్రపతి ముర్ము.. సీజేఐ ప్రతిపాదనను రాజ్యసభ చైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌లకు పంపినట్టు తెలుస్తోంది.

 

న్యాయమూర్తి యశ్వంత్‌వర్మ రాజీనామా, రాష్ట్రపతికి లేఖ

 

ఈ నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. ఈ లేఖను సమర్పించడానికి తనను ప్రేరేపించిన కారణాలతో మీ గౌరవ ప్రదమైన కార్యాలయానికి భారం కలిగించకూడదని భావిస్తున్నట్లు రాసుకొచ్చారు.

 

తీవ్రమైన ఆవేదనతో తాను న్యాయమూర్తి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఆయనను విధుల నుంచి తొలగించాలని పార్లమెంటు ఉభయసభల్లో ఎంపీలు అభిశంసన తీర్మానం ఇచ్చారు. తాజాగా వర్మ రాజీనామాతో అభిశంసన ప్రక్రియ ముగిసిపోతుందని లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. జస్టిస్ వర్మ రాజీనామాతో న్యాయవ్యవస్థలో చర్చ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *