వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పవర్ పాలిటిక్స్ మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయింది. వారికి ఇంకా మూడేళ్ల సమయం ఉన్నది. ఈలోపు గ్రౌండ్ ప్రిపేర్ చేసేందుకు జగన్ ఎదురుచూస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. కేవలం రెండేండ్లలోనే ప్రభుత్వాన్నిఏం చేశారని విమర్శించడం సరికాదని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. మరో ఏడాది వరకు చంద్రబాబు ప్రభుత్వానికి సమయం ఇచ్చాక.. ఆ తర్వాత సిక్స్ గ్యారంటీస్, ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై మరోసారి కదం తొక్కాలని జగన్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
మళ్లీ అదే బాట..
జగన్ గతంలో అధికారంలోకి రావడానికి పాదయాత్ర ఎంతో సాయం చేసింది. తన తండ్రి వైఎస్సార్ బాటలోనే ఆయన నడిచారు. అప్పుడు వైఎస్‌ను ఆదరించిన ప్రజలు.. అలాగే 2019లోనూ జగన్‌ను ఆదరించి ముఖ్యమంత్రిని చేశారు. అయితే, ఆయన అనాలోచిత నిర్ణయాల వల్లే కేవలం ఒక టర్ములోనే తీవ్రమైన వ్యతిరేకతను చవిచూశారు. ఫలితంగా గత ఎన్నికల్లో జగన్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. గత ప్రభుత్వంలో 151 సీట్లు సాధించిన వైసీపీ.. 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యింది. అంటే జగన్ మీద ఎంతటి వ్యతిరేకత వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. దీనంతటికి జగన్.. రాజధాని అమరావతిని నిర్లక్ష్యం చేయడమే కారణంగా తెలుస్తోంది.
వచ్చే ఏడాది క్షేత్రస్థాయికి..
వైఎస్ జగన్ మరోసారి పాదయాత్ర చేపట్టనున్నారు. దీనికి సంబంధించి క్లారిటీ సైతం ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఆయన మరోసారి పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గర అయ్యేందుకు కసరత్తు చేస్తున్నారు. చివరి రెండేండ్లు ఆయన జనంలోనే ఉంటారని తెలుస్తున్నది. ప్రజా సంక్షేమం, ప్రభుత్వ పథకాలు, కూటమి పాలనలో జరుగుతున్న తప్పులు, వైఫల్యాలపై ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారని చర్చ జరుగుతున్నది. ఈసారి కూడా ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే నినాదంతోనే ముందుకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది.కొత్తగా ‘మావిగన్’ మచిలీపట్నం-విజయవాడ, గుంటూరు మధ్య రాజధానిని అభివృద్ధి చేస్తాననే నినాదంతో జగన్ ప్రచారానికి వెళ్తారని టాక్ వినిపిస్తోంది.
రాజధాని అమరావతిలోనే మొత్తం సంపదను ఖర్చు చేయడం సరికాదని జగన్ మందు నుంచి వాదిస్తున్నారు. రాజధాని అవసరమేరకు అక్కడ ఖర్చు చేసి మిగతా జిల్లాలను సమాంతరంగా డెవలప్ చేయడం వలన అక్కడ మౌలిక సదుపాయాలు పెరిగి ఉపాధి లభిస్తుందని.. ఫలితంగా లోకల్‌గానే ఉపాధి అవకాశాలు లభిస్తాయని.. అందరూ రాజధాని ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం ఉండదని.. ఫలితంగా ఎక్కువగా ల్యాండ్ పూలింగ్ కూడా అవసరం లేదని జగన్ చెబుతున్నారు.కాగా, అది ఆచరణలో సాధ్యం కాదని తెలుగు దేశం పార్టీ నేతలు అంటున్నారు.రాష్ట్రానికి మధ్యలో రాజధానిని ఏర్పాటు చేసింనందును అన్ని ప్రాంతాల వారికి సమప్రాధాన్యత లభిస్తుందని కూటమి నేతలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని జగన్ తన పాదయాత్రలో పదే పదే ప్రస్తావిస్తారని టాక్. చంద్రబాబు అమరావతిలోని రియల్టర్ల చేతిలో మొత్తం రాష్ట్ర సంపదను కుమ్మరించాలని చూస్తున్నారని జగన్ విమర్శలు చేయడం గమనార్హం.