సింహం గుర్తుతో కవిత కొత్త పార్టీ..?

తెలంగాణ భవిష్యత్, చరిత్ర ను మార్చే రోజుగా ఈనెల 25 నిలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తాము ఏర్పాటు చేయబోయే పార్టీ.. ఈ గడ్డకు కొత్త నెత్తురును, కొత్త రాజకీయాలను పరిచయం చేస్తుందన్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గల తెలంగాణ జాగృతి కార్యాలయంలో బుధవారం నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన వెయ్యి మంది ఆయన అనుచరులు తెలంగాణ జాగృతిలో చేరారు. వారికి కవిత కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తాము స్థాపించబోయే పార్టీ ప్రజల కోసం కొత్త తరహా రాజకీయాలు చేస్తుందన్నారు. ప్రశ్నించటం, పోరాడటం, పరిష్కరించటం ఇదే తమ పంథా అన్నారు. రాష్ట్రంలో అధికార పక్షం కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు.

 

వారి మద్యలోనే ఉంటా..?

బీఆర్ఎస్ పార్టీ అచేతన స్థితిలో ఉందని.. నిద్రపోతోందన్నారు. గద్వాలలో చేనేత, పత్తి రైతులకు అన్యాయం జరుగుతుంటే కూడా ప్రశ్నించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాలతో ప్రజలను వంచిస్తోందన్నారు. ప్రజల సమస్యల గురించి ప్రశ్నించేది ఎవరు అంటే ప్రతినోట జాగృతి అనే మాట వస్తోందన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు కదులుతామన్నారు. పప్పన్నం తింటూ.. ప్రజల మధ్యలో ఉంటూ వారితోనే కలిసి పనిచేస్తామన్నారు. ప్రజల కోసం పాదయాత్ర చేస్తామని చెప్పారు. సామాన్యుల చేత, సామాన్యుల కొరకు, సామాన్యులే ఉండే రాజకీయం చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయి నిపుణులతో సమావేశమై ప్రజల కోసం అద్భుతమైన అజెండా రూపొందిస్తున్నామని తెలిపారు. ఈనెల 25న పార్టీ ప్రకటన సందర్భంగా తమ ఎజెండాను ప్రజల ముందు ఉంచుతామన్నారు. ఖమ్మం వెలుగుమట్లలో పోరాదినట్లే రానున్న మూడేళ్ల పాటు ఈ ప్రభుత్వంపై ప్రజల తరఫున పోరాటం చేస్తామన్నారు.

 

రైతులకు రైతు భరోసా..

తెలంగాణ వస్తే స్వయంపాలన వస్తుందనుకుంటే ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేసే నేతలు వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పాలన అంతా ఢిల్లీ నుంచే జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చిన సరే కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంగా మారిందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను, హైడ్రా పేరుతో ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా, రుణమాఫీ సగం కూడా చేయకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని మండిపడ్డారు.

 

జాతీయ హోదా..

కానీ తెలంగాణలో అన్ని చేశామంటూ పచ్చి అబద్దాలు చెప్పుకుంటూ ఈ ముఖ్యమంత్రి కేరళకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తుండటం సిగ్గుచేటన్నారు. అప్పర్ భద్రకు కేంద్రం జాతీయ హోదా ఇస్తే రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ హోదా కారణంగా తుంగభద్రకు నీళ్లు రాక నష్టపోయేది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాయేనని చెప్పారు. అయినా సరే ఈ ముఖ్యమంత్రి ఎందుకు మోడీ ని ప్రశ్నించటం లేదని నిలదీశారు. మోడీ ఏం చేసిన సరే రేవంత్ రెడ్డి గప్ చుప్ గా ఉంటున్నారని విమర్శించారు. అటు కాంగ్రెస్ ను, ఇటు బీజేపీని ఇద్దరూ మేనేజ్ చేస్తూ ప్రజలను మాత్రం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడని ఫైరయ్యారు.

 

సింహం గుర్తుతో పోటీ..

గద్వాల్ జిల్లాలో 70 ఏళ్లుగా గడీల కుటుంబాల కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. గద్వాల్ గడీలో టేకేదార్లు పోయి.. ఉద్యమకారుల జెండా ఎగరాలన్నారు. అక్కడి చేనేత, సీడ్ పత్తి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జాగృతి తరఫున సింహం గుర్తుతో పోటీ చేస్తే మొదటి విజయాన్ని ఇచ్చింది గద్వాల్ జిల్లానేనని కవిత గుర్తు చేశారు. రంజిత్ తో పాటు ఆయన అనుచరులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత తనదేనని వారికి హామీ ఇచ్చారు. కవితక్క కోసం నిజాయితీగా చిత్తశుద్ధిగా పనిచేస్తానని నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగొళ్ల రంజిత్ కుమార్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాదం వినిపిస్తూ ప్రజల కోసం ఫైట్ చేస్తున్న కవితక్కను బీఆర్ఎస్ నుంచి కుట్ర చేసి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జాగృతి జెండాను ప్రతి గ్రామానికి తీసుకెళ్తామన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *