తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమారుడు పొంగులేటి హర్ష రెడ్డి, ప్రభుత్వ భూములను కబ్జా చేశారంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ డాక్టర్ క్రిషాంక్ సంచలన ఆరోపణలు చేశారు. నాదర్‌గుల్ ప్రాంతంలోని సుమారు 373 ఎకరాల ప్రభుత్వ భూమిని, దీని విలువ సుమారు రూ. 7,000 కోట్లు ఉంటుందని, శిల్పా ఇన్ఫ్రా వంటి కంపెనీల ద్వారా కబ్జాకు పాల్పడ్డారని ఆయన తన X ఖాతాలో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆధారాలను బయటపెట్టిన వీడియోను క్రిషాంక్ షేర్ చేశారు. వివాదాస్పద స్థలంలో MEIL (మేఘా ఇంజనీరింగ్), శిల్పా ఇన్ఫ్రా, కోహినూర్ గ్రూప్ పేరుతో ఉన్న ఫెన్సింగ్ బోర్డుల ఫోటోలను పంచుకున్నారు క్రిషాంక్. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ స్థలంలో అతివేగంగా కంచెలు ఏర్పాటు చేశారని, మార్చి-ఏప్రిల్ 2026 నాటికి అక్కడ భారీ మార్పులు చోటుచేసుకున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ మంత్రి కుటుంబమే ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారని క్రిషాంక్ ఆరోపించారు.
ఇదే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంత్రి కుటుంబానికి చెందిన సంస్థలు ఇంత భారీ ఎత్తున ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తుంటే ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా భూముల రక్షణ కోసం మంత్రి పర్యవేక్షణలో సాగుతున్న భూ భారతి కార్యక్రమం లక్ష్యం ఇదేనా అని నిలదీశారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులు, అది కూడా అధికార పార్టీకి చెందిన కీలక నేతల కుటుంబ సభ్యులు ఆక్రమించడంపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి లేదా ఆయన కుమారుడు హర్ష రెడ్డి నుండి ఇంకా ఎటువంటి అధికారిక వివరణ రాలేదు.