ప్రస్తుతం భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లి శకం నడుస్తోంది. అంతకుముందు దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ శకం నడించిదనేది మనకు తెలిసిన విషయమే. ఆ సమయంలో భారత్‌తో ఏ జట్టైనా పోరుకు సిద్ధమయ్యిందంటే తొలుత సచిన్‌నే టార్గెట్ చేసేది. సచిన్ ఔట్ చేస్తే సగం పని అయిపోయినట్లేనని ప్రత్యర్థి జట్లు భావించేవి. ఈ క్రమంలోనే సచిన్-మెక్‌గ్రాత్‌ల పోరు, సచిన్-అక్తర్‌ల పోరు, సచిన్- షేన్ వార్న్‌ల పోరు ఎక్కువగా కనువిందు చేసేది. వీరిలో మెక్‌గ్రాత్, అక్తర్‌లు పేస్ బౌలర్లైతే, వార్న్ లెగ్ స్పిన్నర్. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా ఉన్న వార్న్‌పై సచిన్ పైచేయి సాధించిన సందర్బాలు ఎన్నో. అదే సమయంలో సచిన్‌పై వార్న్ కూడా ఆధిక్యం చెలాయించిన మ్యాచ్‌లు కూడా ఉన్నాయి.
కాగా, 1998లో చెన్నైలో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా, రెండో ఇన్నింగ్స్‌లో వీరవిహారం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో వార్న్ బౌలింగ్ సచిన్ నాలుగు పరుగుల వద్ద ఉండగా క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో సచిన్ వీరవిహారం చేశాడు. 155 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆనాడు అంపైర్ తప్పిదంతో సచిన్ ఆదిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడనే తలంపుతో ఉన్న వార్న్ దానికి సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేశాడు. అప్పుడు వార్న్ అప్పీల్ చేసినా దాన్ని ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. ఇప్పుడు చెప్పండి.. అది ఔటా.. నాటౌటా? అంటూ ఒక వీడియో క్లిప్‌ను అభిమానుల ముందుంచాడు. ఇది ఎలా నాటౌట్ అనే విషయాన్ని చెప్పాలంటూ సవాల్ విసిరాడు. ‘ ఇది నిజంగా చాలా సీరియస్. కమాన్ చెప్పండి.. అది ఎలా నాటౌట్’ అని ప‍్రశ్నించాడు.