ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు వరుసగా రెండో వన్డేలోనూ నిరాశ ఎదురైంది. అడిలైడ్ ఓవల్ వేదికగా గురువారం జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ విజయంతో, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కంగారూలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకున్నారు. భారత బౌలర్లు చివరి వరకు పోరాడినప్పటికీ, కీలక సమయంలో ఆసీస్ బ్యాటర్లు రాణించడంతో భారత్‌కు మరోసారి ఓటమి తప్పలేదు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, భారత జట్టును నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులకే పరిమితం చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (9), విరాట్ కోహ్లీ (0) త్వరగా ఔటవ్వడంతో భారత్ కష్టాల్లో పడింది. అయితే, రోహిత్ శర్మ (73), శ్రేయస్ అయ్యర్ (61) బాధ్యతాయుతమైన అర్ధశతకాలతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత అక్షర్ పటేల్ (44) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా (4 వికెట్లు) అద్భుతంగా రాణించాడు.
అనంతరం 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. మాథ్యూ షార్ట్ (74 పరుగులు) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపు బాటలో నడిపించగా, యువ ఆటగాడు కూపర్ కనోలీ (61 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చివరి వరకు నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. అతనికి మిచెల్ ఓవెన్ (36 రన్స్) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో ఆసీస్ గెలుపు సులభమైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ తలో రెండు వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. ఇరుజట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే అక్టోబరు 25న సిడ్నీలో జరగనుంది.