తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఏప్రిల్ 8(మంగళవారం)న తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. దీంతో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో130 మందికి గాయాలు అయ్యాయి. ఈ కేసు విచారణ జరిపిన ఎన్‌ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి మరణశిక్ష విధించింది. అయితే.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఏం జరిగింది..?
2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్ నగరంలోని దిల్ సుఖ్ నగర్‌లో పేలుళ్లు సంభవించాయి. ఈ దాడిలో 18 మంది చనిపోయారు, 130 మందికి గాయాలు అయ్యాయి. NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) దర్యాప్తు జరిపింది. విచారణలో 157 మంది సాక్ష్యాలను రికార్డ్ చేసింది. ఈ దర్యాప్తులో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడని తేలింది., తెహసీన్ అఖ్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్ నిందితులుగా ఉన్నారు. మూడేళ్లపాటు జరిపిన విచారణ అనంతరం.. నిందితులపై మరణశిక్ష పడింది. ఈ కేసుతో పాటు పలు ఉగ్రదాడుల్లో కీలకంగా వ్యవహరించిన యాసిన్ భత్కల్‌ను 2013లో బీహార్- నేపాల్ బోర్డర్ లో పట్టుకున్నారు. దిల్లీ(2008), దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసుతో పాటు ఇతర కేసుల్లో దోషిగా తేలడంతో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.