ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌ను ఏపీకి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజ సంస్థ ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌ను అమరావతికి ఆహ్వానించారు. రాష్ట్రంలో ఏఐ ఆధారిత అభివృద్ధికి గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా కోరారు. భారతదేశం ఏఐకి త్వరగా అలవాటుపడిందని, భారతీయుల సృజనాత్మకత అద్భుతమని ఆల్ట్‌మన్ చేసిన ట్వీట్ కు చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు ఆయనను ఏపీకి ఆహ్వానించారు.

 

ఏఐలో భారత్ దూసుకుపోతోందని శామ్ ఆల్ట్ మన్ చేసిన వ్యాఖ్యల పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏఐ అభివృద్ధికి కేంద్రంగా మార్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

 

“మీరు చెప్పింది అక్షరాలా నిజం! భారతదేశం తన ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ ఏఐ ఆధారిత అభివృద్ధికి కేంద్రంగా మారడానికి సిద్ధంగా ఉంది. మీ తదుపరి భారత పర్యటనలో మిమ్మల్ని అమరావతికి ఆహ్వానించడం నాకు సంతోషంగా ఉంది. భవిష్యత్తును రూపొందించడంలో మా విజన్‌ను మీతో పంచుకుంటాను” అని చంద్రబాబు పేర్కొన్నారు.

 

రాష్ట్రం ఏఐతో పాటు క్వాంటం టెక్నాలజీలో కూడా ముందంజలో ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతిక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని, ఓపెన్ ఏఐతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *