రాష్ట్రపతికి న్యాయస్థానాలు ఆదేశించడమేంటి?.. న్యాయవ్యవస్థకు ఉపరాష్ట్రపతి చురకలు..

శాసనసభల ద్వారా ఆమోదించబడిన బిల్లులపై రాష్ట్రపతి తన నిర్ణయం తీసుకోవడానికి ఒక నిర్దిష్ట గడువు ఉండాలని ఇటీవలే సుప్రీంకోర్టు (Supreme Court) నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పు ప్రస్తుతం వివాదాస్పదమై ఉంది. ఈ విషయంపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ (Vice-President Jagdeep Dhankhar) తాజాగా స్పందించారు. న్యాయవ్యవస్థ రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వడం సరైనది కాదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 

రాష్ట్ర శాసనసభలు ఒకటి లేదా రెండుసార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదించకుండా నిలిపివేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్లులు అత్యధికంగా ఆలస్యం చేయబడడం వంటి సమస్యలపై సుప్రీంకోర్టు ఇటీవలే ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు ఎన్నడూ జరగని విధంగా ఈ తీర్పులో గవర్నర్లతో పాటు రాష్ట్రపతి పదవికి కూడా ఒక గడువు విధించబడింది. గరిష్ఠంగా మూడు నెలల లోపు ఆ బిల్లులను ఆమోదించాలని లేదా తిరిగి పంపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణ సమయంలో కేంద్ర హోంశాఖ సూచించిన మూడు నెలల కాలపరిమితిని, రాష్ట్రాల నుండి గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి తన నిర్ణయం తీసుకోవడానికి సముచితమైన గడువుగా పరిగణించినట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

 

అయితే ఈ తీర్పుని ఉపరాష్ట్రపతి ధన్కర్ తప్పుబట్టారు. ఆయన రాజ్యసభ్యలో కొత్తగా వచ్చిన సభ్యుల కార్యక్రమంలో మాట్లాడుతూ.. “ఇటీవల న్యాయస్థానం ఒక తీర్పు వెలువరించింది. అందులో రాష్ట్రపతికే దిశానిర్దేశం చేశారు. మనం ఏ దిశలో వెళుతున్నాం. దేశంలో ఏం జరుగుతోంది?. ఈ రోజు కోసమా మేము ప్రజాస్వామ్యం కోరుకున్నది. రాష్ట్రపతికే గడువు విధిస్తున్నారు. అలా జరగకపోతే అంటూ హెచ్చరిస్తున్నారు. ఇది చట్టంలో ఉందా. లేకపోతే దీనిపై కూడా కొత్త చట్టం చేస్తారా?, న్యాయమూర్తులు ఇక చట్టాలు కూడా చేస్తారా? వారే వాటిని అమలు పరుస్తారా? వారేమైనా సూపర్ పార్లమెంటా? చట్టాలు వారికి వర్తించవా? ” అని సుప్రీం కోర్టు న్యాయమూర్తులను పరోక్షంగా విమర్శించారు.

ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ (Jagdeep Dhankar) ఇదే సందర్భంగా మరోవిషయంపై తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవలే ఢిల్లీ హై కోర్టుకు చెందిన ఒక న్యాయమూర్తి జస్టిస యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు లభించడంపై ఆయన మాట్లాడుతూ.. “నోట్ల కట్టలు లభిస్తే.. ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? విచారణ ఎలా సాగుతోంది? అనేది బహిర్గతం చేయలేదు. ఇదే ఘటన ఒక సామాన్యుడి ఇంట్లో జరిగి ఉంటే ఇప్పటికే విచారణ జెట్ స్పీడుతో జరిగి ఉండేది. న్యాయవ్యవస్థలో పనిచేసేవారికి ఇలాంటి స్పెషల్ ట్రీట్ మెంట్ ఉండాలి అని చట్టంలో రాసి ఉందా? నేరానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుంటే అది కూడా నేరమే అవుతుంది” అని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *