నకిరేకల్‌లో టెన్త్ పేపర్ లీక్..! కేటీఆర్‌పై కేసు..?

నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో 10వ తరగతి పరీక్ష మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డ వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. నకిరేకల్‌లో టెంత్‌ ఎగ్జామ్‌ మొదలైన అరగంటకే వాట్సాప్‌లో తెలుగు ప్రశ్నా పత్రం చక్కర్లు కొట్టింది. విషయం తెలుసుకున్న నల్గొండ DEO.. నకిరేకల్ MEOను విచారణకు ఆదేశించారు. నకిరేకల్‌ లోని బాలికల సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌.. రూమ్ నంబర్ 8 వద్ద ఉదయం పది గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అక్కడ కిటికీ వద్దకు వచ్చి పరీక్ష రాస్తున్న అమ్మాయి వద్ద ఆమె ప్రశ్నా పత్రం సెల్ ఫోనులో ఫోటో తీసుకుని వెళ్లిపోయినట్టు విచారణలో తేలింది. దీంతో నకిరేకల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

తమ బంధువుల పిల్లలకు ఎక్కు మార్కులు రావాలనే ఉద్దేశంతోనే నిందితులు ఈ మాల్‌ ప్రాక్టీస్‌కు పూనుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. స్కూల్‌ గేటు వద్ద పోలీసుల బందోబస్తు ఉండటంతో స్కూల్‌ లోకి ప్రవేశించడానికి వీలు కాక.. A1 చిట్ల ఆకాష్, A3 చిట్ల శివతో పాటు మరొకరు కలిసి.. స్కూటీ మీద స్కూల్ వెనుక వైపుకు వెళ్లారు. అక్కడ A-11 రాహుల్‌ కూడా వుండటంతో మరో వ్యక్తితో కలిసి పాఠశాల వెనుక గోడ కిటికీ వైపు ఉన్న ఒకటవ అంతస్తులో రూము నెంబరు 8లో పరీక్ష రాస్తున్న విద్యార్థినిని ప్రశ్నా పత్రాన్ని చూపించమని సెల్‌ పోన్‌లో ఫోటో తీసుకొని.. అక్కడ నుంచి వెళ్లిపోయారు.

 

నేరస్తులు ఒకరి నుంచి మరొకరు ప్రశ్నపత్రాలను వాట్సాప్‌ ద్వారా పంపుకున్నారు. ప్రశ్నపత్రంలో ఉన్న ప్రశ్నలకు A-4 గుడుగుంట్ల శంకర్‌ సమాధానాలు తయారు చేసి వాటిని.. A-5 బ్రహ్మదేవర రవిశంకర్‌ జీరాక్స్‌ షాపులో జీరాక్స్‌ తీసి.. నిందితులు వారికి తెలిసిన వారికి ఇవ్వడానికి తిరిగి ఎగ్జామ్‌ సెంటర్‌కు వెళ్లారు. అయితే, అక్కడ ఉన్న పోలీసులను చూసి దొరికి పోతామేమోనని వెళ్లిపోయారు. కాగా, ప్రశ్నపత్రాలను వాట్సాప్‌లో సర్కులేట్‌ చేయడంతో వైరల్‌గా మారాయి.

 

ఈ కేసులో A-1గా చిట్ల ఆకాష్, A-2గా చిట్ల శివ, A-3గా బండి శ్రీను, A-4గా గుడుగుంట్ల శంకర్, A-5గా ఉన్న బ్రహ్మదేవర రవిశంకర్ లను రిమాండ్‌కు తరలించగా.. A-6గా పోగుల శ్రీరాములు, A-7గా తలారి అఖిల్ కుమార్, A-8గా ముత్యాల వంశీ, A-9గా పలాస అనిల్ కుమార్, A-10గా పళ్ల మనోహర్ ప్రసాద్, A-11గా రాహుల్‌ ను జువెనైల్ బోర్డు ముందర హాజరు పరిచారు.

 

నకిరేకల్ టెంత్‌ ఎగ్జామ్‌ పేపర్‌ లీక్‌ విషయంలో వేరువేరు కేసుల్లో BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTRపై రెండు కేసులు నమోదయ్యాయి. అలాగే, సోషల్‌ మీడియా ఇంచార్జ్‌లు మన్నేం క్రిశాంక్, కొణతం దిలీప్ కుమార్‌పై స్థానిక కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదు అయ్యాయి. తమకు సంబంధం లేకున్నా సోషల్ మీడియా వేదికగా తమపై తప్పుడు ప్రచారం చేశారంటూ నకిరేకల్ మున్సిపల్ చైర్ పర్సన్ చౌగోని రజిత శ్రీనివాస్‌తో పాటు మరో వ్యక్తి ఉగ్గిడి శ్రీనివాస్‌ వేరువేరుగా నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పేపర్ లీకేజీ కేసులోని నిందితులతో తమకు ఎలాంటి సంబంధాలు లేకపోయినా.. తమకు సంబంధం ఉందంటూ తెలుగు స్క్రైబ్‌లో వచ్చిన కథనాన్ని KTR ఎక్స్‌లో షేర్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

BC సామాజికవర్గానికి చెందిన తమపై ఇలాంటి దుష్ప్రచారంతో తమ పరువుకు భంగం కలిగిందంటూ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీంతో ఈ కేసులో A1గా మన్నేం క్రిశాంక్, A2గా KTR, A3గా కొణతం దిలీప్ కుమార్‌లతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఉగ్గిడి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం A1గా కొణతం దిలీప్ కుమార్, A2గా మన్నెం క్రిశాంక్, A3గా KTR, A4గా తెలుగు స్క్రైబ్ ఎండి, A5గా మిర్రర్ టివి యూట్యూబ్ ఛానెల్ ఎండితో పాటు మరి కొందరిపై కేసు నమోదు చేసినట్లు నకిరేకల్ పోలీసులు తెలిపారు. అయితే ఈ పేపర్ లీకేజీ కేసులో మొత్తం 11 మంది నిందితులతో పాటు ఇద్దరు మైనర్లపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఒక మైనర్ బాలునితో పాటు అయిదుగురిని అరెస్ట్ చేశారు. మరో మైనర్‌తో పాటు ఆరుగురు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *