అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి.. స్పీకర్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. చివరికి ఆయన సస్పెన్షన్‌కు దారి తీశాయి. ప్రజా సమస్యలపై గౌరవప్రదమైన చర్చ చేయాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. హద్దులు దాటి మాట్లాడారు. ముఖ్యంగా ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యకమయ్యాయి. కాంగ్రెస్ నేతలు ఆయన మాటలపై మండిపడ్డారు. స్పీకర్ స్థానానికి ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ కడిగిపాడేశారు. మీడియాలో కూడా దీనిపై గట్టిగానే చర్చ జరిగింది. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై కవిత, కేటీఆర్, హరీష్ రావులు సచివాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలు వ్యక్తం చేశారు. మొత్తం వ్యవహారాన్ని డైవర్ట్ చెయ్యాలని ప్రయత్నించారు. కానీ, అప్పటికే నష్టం జరిగిపోయింది.
జగదీశ్ రెడ్డి తమ పార్టీ నేత కాబట్టి.. తప్పని పరిస్థితుల్లో మద్దుతుగా నిలవాల్సి వచ్చిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. పైగా.. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ సైతం అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. జగదీశ్ రెడ్డికి క్లాస్ పీకారని సమాచారం. ఇకపై నోరు జాగ్రత్త.. బేకారు మాటలు వద్దని హెచ్చరించారని తెలిసింది. కేవలం ఒక్క రోజు మాత్రమే సభకు హాజరైన కేసీఆర్.. మున్ముందు జరిగే సమావేశాలకు కూడా హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పకుండా హాజరు కావాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒక సెషన్ మొత్తానికి జగదీష్ రెడ్డి సస్పెండ్ కావడమనేది బీఆర్ఎస్‌కు మింగుడు పడని విషయం.
అసెంబ్లీ సమావేశాలకు ముందు కేసీఆర్ ప్రత్యేకంగా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పుడే ఆయన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో జగదీశ్ రెడ్డితో ఆ వ్యాఖ్యలు కేసీఆరే చేయించి ఉంటారని కాంగ్రెస్ నేతలు సందేహిస్తున్నారు. ఆయన వ్యాఖ్యల వివాదం అటు తిరిగి ఇటు తిరిగి కేసీఆర్‌కు తగలడంతో పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. అందుకే, ఆయన సస్పెన్షన్ విషయంపై నిరసనలు ఆపేసినట్లు తెలుస్తోంది. పైగా హోలీ సందడిలో వారి నిరసనలు పట్టించుకొనేవారు కూడా ఎవరూ లేరని, అందుకే మళ్లీ అసెంబ్లీ సమావేశాల టైమ్‌లోనే నిరసనలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
అయితే బీఆర్ఎస్ దగ్గర ఉన్న మరో ఆప్షన్.. సస్పెన్షన్ అంశాన్ని రాజకీయం చెయ్యడం. దీనిపై వారు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. అలాగే సభలో మిగతా ఎమ్మెల్యేలతో కూడా అలాగే మాట్లాడించి సస్పెండ్ అయ్యేలా వ్యూహం రచిస్తుందా? లేదా అక్కడితో ఆ మ్యాటర్ వదిలేస్తుందా అనేది చూడాలి. అయితే, ఈ విషయాన్ని అక్కడితో వదిలేస్తే జగదీశ్ రెడ్డి తప్పు చేశారని బీఆర్ఎస్ అంగీకరించినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన మాటల గురించి కాకుండా.. కేవలం సస్పెన్షన్ విషయాన్నే హైలెట్ చేస్తూ నిరసనలకు దిగే అవకాశం ఉంది. మరి దీనిపై కేసీఆర్ వ్యూహం ఏ విధంగా ఉంటుందో చూడాలి. సస్పెన్షన్‌పై నిరసన? లేదా సైలెన్సా అనేది చూడాల్సి ఉంది.