పిఠాపురంలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. ప్రసంగం ప్రారంభంతోనే వైసీపీకి ఇచ్చి పడేశారు. ‘‘తొడలు కొట్టారు. మన ఆడపడుచులను అవమానించారు. జనాలను నిరంతరం హింసించారు. ఇదేం న్యాయం అని అడిగితే.. కేసులు పెట్టి జైళ్లలో పెట్టారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసులో బంధించారు. వాళ్ల కార్యకర్తలను రోడ్డు మీదకు రావాలంటే భయపడేలా చేశారు. వారు చేయని కుట్ర, వేయని కుతంత్రం లేదు. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి చరచిన ఆ తొడల్ని.. మనం బద్దలకొట్టాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతో అడుగుపెట్టాం. దేశమంతా తలతిప్పి తిరిగి చూసేలా 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించాం’’ అని పేర్కొన్నారు.
ఓజీ.. ‘నో’ జి
‘ఓజీ’ అంటూ నినాదిస్తున్న కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘వైసీపీ సిద్ధాంతాల కోసం చనిపోయిన జనసైనికుల గౌరవం కోసం.. మీరు ఇక్కడ సినిమాల గురించి నినాదాలు చేయొద్దు’’ అని తెలిపారు.
అమ్మా, నాన్న తిట్టారు
‘‘2003లో మా అమ్మనాన్నకు చెప్పా రాజకీయాల్లోకి వెళ్తానని. అది విని.. మంచి కెరీర్ వదిలి వెళ్తావా అని మా నాన్నా, అమ్మ తిట్టారు. కానీ, నాకు సినిమా ఉపకరణం అయ్యింది కానీ, జీవితం కాలేదు’’ అని అన్నారు పవన్.
గద్దర్‌తో స్నేహం..
గద్దర్‌తో తనకు ఏర్పడిన పరిచయం గురించి చెబుతూ.. ‘ఖుషీ’ మూవీ చూసి మా అన్నయ్యను పట్టుకుని మీ తమ్ముడిని కలవాల్సిందే నేను అని గద్దర్ అన్నారు. వెంటనే అన్నయ్య ఫోన్ చేసి.. గద్దర్ నిన్ను కలవాలి అనుకుంటున్నారని చెప్పారు. ఆ తర్వాత గద్దర్ గారిని కలిశాను. యే మేరా జహా.. సాంగ్‌లో భరత మాత సంకెళ్లతో ఉన్న ఒక సీన్ గురించి వివరించారు. నాలో దేశభక్తిని ఆయన గుర్తించారు. అప్పటి నుంచి ఆయనతో నాకు స్నేహం ఏర్పడింది అని వివరించారు పవన్.
చిల్లరగాళ్లు కాదు.. భవిష్యత్తు నిలబెట్టే యువత కావాలి
భవిష్యత్తును నిలబెట్టే యువత కోసం చూస్తున్నా. ఊరికి వందమంది నాయకులను తయారు చెయ్యాలి. రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలోకి వెళ్లే నాయకులను తయారు చెయ్యాలి 2047 నాటికి. విదేశాలకు వెళ్లే పరిస్థితి రాకూడదు. అదే నా లక్ష్యం. దాని గురించే పనిచేద్దాం. చిల్లర వేషాలు.. పనికి మాలిన వేషాలు వేసేవారిని గత ప్రభుత్వంలో చూశాం. అలాంటి వాళ్లు అధికారంలోకి వచ్చారంటే తప్పు మనది. ఎవరినైనా సరే మీరు ఎన్నుకుంటున్నారు. ఇక అలా చెయ్యకూడదు.
సనాతనం నా రక్తంలోనే ఉంది
ఓ ఇంగ్లీషు పత్రికలో.. నేను అకస్మాత్తుగా సనాతన ధర్మ రక్షకుడిగా మారిపోయానని ఎద్దేవా చేశారు. కానీ, సనాతనం అనేది నా బ్లడ్‌లోనే ఉంది. నేను 14 ఏళ్ల వయస్సు నుంచే దీక్ష మొదలుపెట్టాను. నేను ఎవరికీ ప్రూవ్ చేసుకోవల్సిన అవసరం లేదు. ఈ ధర్మం అందరికీ అవకాశం వచ్చింది. సనాతన ధర్మం ఉంది కాబట్టే విజయనగరం రాజులు మసీదులు కట్టారు. బతుకమ్మలను అవమానించి మాట్లాడితే అడగకూడదా? అమ్మవారికి ఒక న్యాయం.. మహమ్మద్‌కు ఒక న్యాయమా అని అంటూ అక్బరుద్దీన్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు పవన్. అల్లాను ద్వేషించమని మాకు సనాతన ధర్మం చెప్పలేదు అని అన్నారు. మీరు సినిమాలు సినిమాలు అని అరుస్తారు. అక్కడే ఆగిపోయారు. నేను అమితాబ్‌కు అభిమానిని. చిరంజీవికి అభిమానిని. దేశానికి అంతకంటే పెద్ద అభిమానిని.
తమిళ-హిందీ వివాదంపై స్పందిస్తూ..
పవన్ చివరిగా.. తమిళ, హిందీ భాషల వివాదంపై కూడా స్పందించారు. భారత దేశం భిన్నత్వంలో ఏకత్వమని.. బహుభాషా విధానాన్ని పాటించాలని కోరారు. హిందీ భాష అక్కర్లేనప్పుడు తమిళ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారని ప్రశ్నించారు. అలాగే నార్త్, సౌత్ వివాదంపై కూడా పవన్ స్పందించారు. ఉత్తరం, దక్షిణ భారతం అంటూ దేశాన్ని కేకుల్లా కోసి విడదీయొద్దని కోరారు. దేశం కోసం తాను ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధమేనని అన్నారు. అయితే, పవన్ ప్రసంగమంతా వైసీపీపై విమర్శలు.. సనాతన ధర్మం గురించే సాగింది. డీసీపీగా ఏపీకి భవిష్యత్తులో ఏం చేయబోతున్నారనే విషయాలేవీ చెప్పలేదు.