వివేకా కేసులో కొత్త ట్విస్ట్..! సాక్షుల మృతిపై విచారణ..?

వైఎస్ వివేకానంద హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన సాక్షులు మరణించడంపై రకరకాల వార్తలు హంగామా చేస్తున్నాయి. హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్ రంగయ్య రెండురోజుల కిందట మృతి చెందారు. దీనిపై ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కడప ఎస్పీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాక్షుల మరణంపై ప్రత్యేక నిపుణుల టీమ‌తో విచారణను మొదలు పెడుతున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.

 

వివేకా హత్యపై సీఎం ఏమన్నారు?

 

రీసెంట్‌గా అమరావతిలో ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్పటి టీడీపీ సర్కార్ అప్రమత్తంగా లేకపోవడం వల్లే నిందలు మోయాల్సి వచ్చిందన్నారు. వైసీపీ ఎత్తులను నిఘా వర్గాలు గుర్తించలేక పోయాయని, వారి ఆలోచనలు ఆ రేంజ్‌లో ఉంటాయన్నారు. ఈ అంశాన్ని వైసీపీ రాజకీయంగా ఉపయోగించుకుని 2019 ఎన్నికల్లో లబ్ధి పొందిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అవకాశాలు ఇవ్వరాదన్నారు సీఎం చంద్రబాబు.

 

కీలక సాక్షి రంగన్న మృతి

 

ఈ సమావేశం జరిగిన రెండు రోజులకే వివేకా కేసులో కీలక సాక్షి వివేకానంద ఇంటి వాచ్‌మేన్ రంగయ్య మృతి చెందారు. రంగయ్య మృతిపై ఆయన భార్య ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై రంగన్న భార్య సుశీలమ్మ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదుతో పులివెందుల పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. రంగయ్య మృతదేహానికి గురువారం రిమ్స్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించారు.

 

కడప ఎస్పీ ప్రకటన

 

వివేకా కేసులో ఇప్పటివరకు ప్రధాన సాక్షులుగా ఉన్న నలుగురు చనిపోయారన్నది పోలీసుల మాట. ఆరుగురు చనిపోయినట్టు అధికార పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో వీరందరి మరణాలపై శాస్త్రీయమైన దర్యాప్తుకు సాంకేతిక నిపుణుల సాయం తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వెంటనే కడప జిల్లా ఎస్పీఅశోక్‌ కుమార్ సంచలన ప్రకటన చేశారు.

 

సాక్షుల మరణాలపై విచారణకు ఆయన ఆదేశించారు. సాక్షుల మరణాలపై నిపుణుల టీమ్‌తో విచారణను చేస్తున్నట్లు తెలిపారు. రంగన్న అత్యంత అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నామన్నారు. ఈ కేసులో ప్రధాన సాక్షులు ఐదుగురు చనిపోయారని వివరించారు. పదేపదే ఎందుకు సాక్షులు మరణిస్తున్నారో తెలియాల్సి ఉందన్నారు.

 

సాక్షుల మరణం వెనుక దర్యాప్తు సంస్థలు, పోలీసులు ఉన్నారనటం చాలా బాధాకరమన్నారు ఎస్పీ. ఒకే పరిణామ క్రమంలో జరుగుతున్న ఈ మరణాలపై అన్నికోణాల్లో సైంటిఫిక్ ఆధారాలతో దర్యాప్తు కొనసాగుతుందన్నారు. వివేక హత్య కేసులో నేరుగా ప్రమేయం ఉన్న ముద్దాయిల పాత్రపై లోతైన విచారణకు ఆదేశించారు.

 

దీంతో ఈ కేసులో నిందితులు, నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి గుండెల్లో అప్పుడే టెన్షన్ మొదలైంది. మళ్లీ విచారణ తప్పదంటూ చర్చించుకోవడం పులివెందులలో ప్రచారం సాగుతోంది. విచారణ జరుగుతున్న సమయంలో ఒకవేళ ఈ కేసును కూటమి ప్రభుత్వం సీఐడీకి గనుక ఇస్తే అరెస్టులు తప్పవని అంటున్నారు. మొత్తానికి వివేకానంద కేసు వ్యవహారాన్ని తిరగతోడేలా సమగ్ర దర్యాప్తు జరగనుంది.

 

పులివెందుల టీడీపీ నేత రియాక్షన్

 

టీడీపీ పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి రియాక్ట్ అయ్యారు. కీలక సాక్షి రంగన్న మృతిపై వైసీపీ తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందన్నారు. మృతి చెందిన సాక్షులు శ్రీనివాసులరెడ్డి, గంగాధర్‌రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, అభిషేక్‌రెడ్డి, డ్రైవర్‌ నారాయణ, రంగయ్య ఉన్నారన్నది ఆయన మాట. అభిషేక్‌రెడ్డి నాలుగు నెలలుగా ఆసుపత్రిలో కోమాలో ఉండి చనిపోయారన్నారు. రంగన్న మరణాన్ని పోలీసులపై నెట్టే ప్రయత్నం జరుగుతోంద న్నారు. రంగన్న భార్య మాటలు మాత్రం పోలీసుల వేధింపులతో మరణించినట్లుగా పేర్కొంది. ప్రభుత్వంపై ఆ నెపాన్ని నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు బీటెక్‌ రవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *