ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ హయాంలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన నేతలకు కష్టాలు మొదలవుతున్నాయి. ఇప్పటికే కొందరు అరెస్టు అయ్యారు.. మరికొందరు కోర్టుల చుట్టూ బెయిల్ కోసం తిరుగుతున్నారు. రేపో మాపో అరెస్టు కానున్న నేతల జాబితాలో కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ పేర్లు బయటకు వచ్చాయి. వారికంటే ముందు మాజీ మంత్రులు రోజా, విడుదల రజినీ ఉన్నట్లు తెలుస్తోంది.
రజనీ వ్యవహారమేంటి?
మాజీ మంత్రి విడదల రజినీ జైలుకు వెళ్లక తప్పదన్న టీడీపీతోపాటు వైసీపీలోని ఓ వర్గం బలంగా చెబుతోంది. రజనీ అక్రమాలపై పదుల సంఖ్యలో ఫిర్యాదు వెల్లువెత్తాయి. రెండు కేసుల్లో బెయిల్ కోసం న్యాయస్థానం గడప తొక్కారు. ముఖ్యంగా చిలకలూరి పేటలో భూ ఆక్రమాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు చేశారన్నది ప్రధాన ఆరోపణలు. చాలామంది వద్ద డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి.
టీడీపీ ఆఫీసుకు వచ్చి దాదాపు 20 మంది ఫిర్యాదు చేశారు రజనీ బాధితులు. ఆరేడు కేసులు నమోదు అంతా రెడీ చేస్తున్నారు పోలీసులు. ఎస్టీ, ఎస్సీ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఆమె. షాపింగ్ కాంప్లెక్స్ వ్యవహారం, స్టోన్ క్రషింగ్, ఎడ్లపాడు భూములు అందులో ఉన్నట్లు తెలుస్తోంది.
చిలకలూరి పేట బాలాజీ స్టోన్ క్రషర్‌కు సంబంధించి అధికారులు విచారణ చేస్తున్నారు. దీనిపై విచారణకు గవర్నర్ నుంచి అనుమతి తీసుకున్నారు. రేపో మాపో కేసు సైతం నమోదు అయ్యే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నమాట.
రోజా చుట్టూ బిగిస్తున్న ఉచ్చు
మరో మంత్రి రోజా విషయానికొద్దాం. నగరిలో రోజాపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారులకు మాత్రమే కాదు.. చివరకు బాధితులు టీడీపీ ఆఫీసుకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో రూ.120 కోట్ల దుర్వినియోగం అయ్యాయనేది ఆరోపణలు లేకపోలేదు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తామని మంత్రి రాంప్రసాద్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. వైసీపీ కార్యకర్తలు సైతం రోజాపై విరుచుకుపడిన సందర్బాలు లేకపోలేదు.
ఏపీ ఆత్యా-పాత్యా సంఘం సీఈవో సీఐడీకి ఈ ఫిర్యాదు చేశారు. ఆడుదాం ఆంధ్రా-సీఎం కప్ కార్యక్రమాల పేరిట అనేక అవకతవకలకు పాల్పడ్డారని ప్రస్తావించారు. ఆమెతోపాటు శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ ఉన్నారనేది ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో స్వతంత్ర విచారణ కమిటీ వేస్తున్నట్లు మండలిలో మంత్రి రాంప్రసాద్ ప్రకటన చేశారు.
ఈ కమిటీ కేవలం 45 రోజుల్లో సభకు నివేదిక ఇస్తుందన్నారు. తాజాగా విచారణకు ఆదేశించడంతో రోజాకు కష్టాలు తప్పవని అంటున్నారు. విచారణ వ్యవహారం వెలుగులోకి రాగానే వైసీపీలోని కొందరు నేతలతో రోజా మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఏం చేయ్యాలి? ఏలా అడుగులు వేయాలని సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
రోజా మంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారామె. రాజకీయాల్లో విమర్శలు సహజమేనని భావించి ఆమె మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే తన శాఖలో అవినీతి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో అటువైపు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఇద్దరు మహిళా నేతలకు కష్టాలు తప్పవన్నమాట.