ఇంకొద్ది రోజుల్లో వార్షిక బడ్జెట్.. పార్లమెంట్ ముందుకు రానుంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. బడ్జెట్ ప్రతిపాదనలను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పనపై కసరత్తు సాగుతోంది. దీనికి ప్రారంభ సూచికగా హల్వా కార్యక్రమం ముగిసింది కూడా.
పన్నుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందనేది బహిరంగ రహస్యమే. దేశంలో ట్యాక్స్ టెర్రరిజం కొనాగుతోందని, నానా రకాలుగా ట్యాక్సులను వసూలు చేస్తోన్నారంటూ మొన్నటికి మొన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ఆరోపణలు గుప్పించారు.
ఈ క్రమంలో ఆయన కొన్ని డిమాండ్లను కేంద్రం ముందు పెట్టారు. ఆరోగ్య బడ్జెట్‌ను 10 శాతానికి పెంచండం, హెల్త్ ఇన్సూరెన్స్‌పై పన్నులను పూర్తిగా తొలగించడం వంటివి ఉన్నాయి. ఆరోగ్య భారత్‌ను నిర్మించాలనుకుంటే ఈ రంగంపై పన్నులు ఉండకూడదని ఆయన అభిప్రాయపడుతున్నారు.
తాజాగా మజిల్స్ అండ స్ట్రెంగ్త్ ఇండియా సంస్థ కూడా ఇదే విషయాన్ని బలపరిచింది. ఆరోగ్య రంగంపై కేంద్రం అమలు చేస్తోన్న 18 శాతం జీఎస్టీ శ్లాబ్‌ను అయిదు శాతానికి తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీనివల్ల ఆరోగ్యం, శరీర ధారుడ్యం పెంపొందించుకోవడానికి అవసరమని ఉత్పత్తులు, పరికరాల ధర తగ్గుతుందని, వాటిని విస్తృతంగా ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారని పేర్కొంది.
పౌష్టికాహారం, దానికి అవసరమైన వస్తువులు, అందులో వినియోగించే ఆహార పదార్థాలపైనా జీఎస్టీ భారం అధికంగా ఉందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రవీణ్ చిరానియా అన్నారు. సెల్ఫ్ కేర్, ప్రీవెంటివ్ హెల్త్ కేర్, ఫిట్‌నెస్, వెల్‌నెస్ ఇండస్ట్రీ మరింత బలోపేతం కావాలంటే జీఎస్టీ శ్లాబ్‌ను తగ్గించాల్సి ఉంటుందని చెప్పారు.