తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేస్తోంది. చెప్పిన విధంగానే రిపబ్లిక్ రోజున సీఎం రేవంత్ నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించారు. ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని పేర్కొన్నారు. ప్రారంభం రోజు ఆదివారం కావడంతో రైతు భరోసా డబ్బులు జమకావని తేల్చి చెప్పారు. అర్ధరాత్రి తరువాత రైతుల ఖాతాల్లో నిధుల జమ మొదలైంది. ప్రభుత్వం ఖరారు చేసిన మార్గదర్శకాల మేరకు అర్హులైన రైతులకు నిధులు అందనున్నాయి. అయితే, గతంలో అమలు చేసిన విధంగానే విడతల వారీగా నిధులు జమ అవుతాయని అధికారులు వెల్లడించారు.
నిధులు విడుదల
రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. ఇప్పటికే బ్యాంకుల్లో నిధుల జమ అయ్యాయి. గత ప్రభుత్వం అమలు చేసిన విధానంలో కొన్ని మార్పులు చేసారు. సాగు చేసే భూములకే భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, భూమి లేని వారిని కూడా ఆదుకోవాలని గతంలో కూలీలు అడిగారని, వారి కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను తీసుకువచ్చినట్లు సీఎం రేవంత్ వెల్లడిం చారు. కూలీ పని చేసే పేదలకు ఆ పథకం కింద రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.
విడతల వారీగా
ఇక, ప్రస్తుత రైతు భరోసా నిధుల జమ విషయంలో అధికారులు స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు ఈ సీజన్ నుంచి ఎకరాకు రూ.6 వేల చొప్పున ఏడాదికి రూ.12 వేలు భరోసా కల్పిస్తున్నారు. నిధుల జమ సైతం విడతల వారీగా అమలు కానుంది. గతంలో అనుసరించిన విధానాన్నే కొనసాగిస్తున్నారు. తొలి రోజు ఎకరంలోపు, ఆ తర్వాత ఎంకరంన్నర, రెండెకరాలు ఇలా విడతల వారీగా ‘ఈ కుబేర్’ విధానం ద్వారా ఖాతాల్లో నగదు జమ కానుంది. అందరికీ ఒకటే రోజు కాకుండా వారికి ఉన్న సాగు భూముల లెక్క ప్రాతిపదికన నిధులు వరుసగా జమ అయ్యేలా బ్యాంకులకు అధికారులు వివరాలు అందించారు.
రైతుల కోసం
ఇక, నిధుల జమలో ఎదురయ్యే సాంకేతిక సమస్యల పైన అధికారులు ఫోకస్ చేసారు. గతంలో
ఎదురైన సమస్యలను అధికారులు ప్రస్తావిస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా రైతులు తమ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలను క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారుల వద్ద సమర్పిం
చేందుకు ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ వివరాలను పరిశీలించి అర్హులకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించారు. ఇటీవలే రాష్ట్రంలో గ్రామాల వారీగా చేపట్టిన సర్వేలో నంబర్ల వారీగా సాగుకు పనికిరాని భూములను గుర్తించారు. ఆ విస్తీర్ణం వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు పోర్టల్ నుంచి తీసివేయనున్నారు. దీంతో, రైతుభరోసా నిధుల జమ విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది.