పోలింగ్ లో పొరపాట్లా… అలాంటి అవకాశమే లేదన్న సీఈసీ..

పోలింగ్ డేటా వ్యవస్థ పకడ్బందీగా ఉందని, ఎటువంటి తప్పిదాలకు తావు లేదని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మరోమారు స్పష్టం చేశారు. పోలింగ్‌లో అక్రమాలకు అవకాశం ఉందంటూ గతంలో వచ్చిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. లోక్‌సభతో పాటు ఆయా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ డేటా తారుమారు అయిందంటూ కొంతకాలంగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మరోమారు స్పందించారు.

 

‘లోక్‌సభ 2024 అట్లాస్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పోలింగ్ బూత్ స్థాయి అధికారులు సహా లక్షలాది మంది సిబ్బంది పోలింగ్ డేటాలో పాలుపంచుకుంటారని, కాబట్టి పొరబాటు జరగడానికి ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యవస్థ అని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా తప్పు చేస్తే తమ వ్యవస్థ సహించదని అన్నారు. పోలింగ్ డేటా వ్యవస్థ పకడ్బందీగా ఉంటుందని స్పష్టం చేశారు.

 

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈసీ విడుదల చేసిన పోలింగ్ డేటా‌లో తేడాలు ఉన్నాయని ఇటీవల విపక్షాల నుంచి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *