సినీనటి బిజెపి నాయకురాలు మాధవి లత జెసి ప్రభాకర్ రెడ్డి ల మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మాధవి లతను ప్రాస్టిట్యూట్ అని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఆమెకు క్షమాపణలు చెప్పారు. తన వయసు 72 సంవత్సరాలని ఆవేశంలో నోరు జారానని అయితే తాను అలాంటి పదం వాడకుండా ఉండాల్సింది అని ఆయన పేర్కొన్నారు.
మాధవీలతకు సారీ చెప్పిన జేసీ
తనకు ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదని జెసి ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మాధవి లతను ఆ మాట అన్నందుకు మాత్రమే సారీ చెబుతున్నానని పేర్కొన్న జెసి ప్రభాకర్ రెడ్డి బిజెపి నాయకులపై మరోమారు రెచ్చిపోయారు. జెసి ప్రభాకర్ రెడ్డి పై బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇక జెసి పార్కులో చందాల వసూళ్ల పైన బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నోట్ల కట్టలు టేబుల్ పై విసిరి జేసీ సంచలన వ్యాఖ్యలు
నోట్ల కట్టలు టేబుల్ పైన విసురుతూ తాను పిలుపిస్తే ప్రజల నుంచి వచ్చే స్పందన ఇది అంటూ చెప్పుకొచ్చారు. తాను ఎవరిని బలవంతంగా డబ్బులు అడగలేదని తాడిపత్రి ప్రజలకు తనపై ప్రేమ ఉంది కాబట్టే వారు కట్టలు కట్టలు డబ్బులు చందాలుగా ఇస్తున్నారని, అయితే ఆ డబ్బులను తాను తాడిపత్రి అభివృద్ధికి వాడతానని జెసి ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
తాడిపత్రి అంటే జెసి జెసి అంటే తాడిపత్రి అని అది తన పవర్ అని జెసి ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
నోరు జారానని ఒప్పుకున్న జేసీ
తాను ఎవరికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్న ఆయన డిసెంబర్ 31వ తేదీ రాత్రి తాను మహిళల కోసం పార్టీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ వేడుకల పైన బీజేపీ మహిళా నేతలు మాధవి లత, సాదినేని యామిని చేసిన విమర్శలకు సమాధానం చెప్పే క్రమంలో నోరు జారానని తాను నోరు జారి మాట్లాడిన ఆ మాటకు క్షమాపణలు తెలిపారు. వాడకూడని బూతు పదం వాడినందుకు క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు.
వాళ్ళంతా ఫ్లెక్సీ గాళ్ళు అని బీజేపీ నాయకులపై విమర్శలు
ఆపై తనపై విమర్శలు చేసిన ఎవరిని వదిలిపెట్టకుండా టార్గెట్ చేశారు. తనపై విమర్శలు చేసేవాళ్లు నాయకులు కాదని వారంతా ఫ్లెక్సీ గాళ్ళని జెసి ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. తనపై మాట్లాడేవాళ్లు ప్రజలకు మేలు చేస్తే బాగుంటుందని ఆయన హితవు పలికారు.