సంధ్య థియేటర్ ఘటన.. స్పందించిన అల్లు అర్జున్ టీమ్..

అభిమానం.. ఎలా ఉంటుందో తెలుగు ప్రేక్షకులను చూస్తే తెలుస్తోంది. తమ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. టికెట్ ధర ఎంత ఉన్నా.. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా.. కుటుంబంతో కలిసి వచ్చి సినిమాను వీక్షిస్తారు. ఇక అదే హీరో.. తమతో పాటు సినిమా చూడడానికి వస్తున్నాడు అంటే.. ఫ్యాన్స్ ఆగుతారా.. ? ఆ సమయంలో ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తాయి. తమ అభిమాన హీరోను చూడాలనే తొందరలో.. వారు ఏం చేస్తున్నారు .. ? అనేది కూడా కనిపించదు. అలాంటి అభిమానుల అత్యుత్సాహం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

 

గత రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షోలో ఒక విషాద ఘటన చోటుచేసుకున్న విషయం తెల్సిందే. సంధ్య థియేటర్ లో గతరాత్రి పుష్ప 2 ప్రీమియర్ షో వేశారు.ఈ షోకు దిల్షుఖ్ నగర్ ఏరియాకి చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) కలిసి వచ్చారు. చిన్నప్పటి నుంచి శ్రీ తేజ్ కు అల్లు అర్జున్ అంటే ఇష్టం కావడంతో.. కుటుంబంతో సహా భాస్కర్ పుష్ప 2 ను చూడడానికి వచ్చాడు. అంతా బాగుంది. మరికొద్దిసేపటిలో సినిమా చూస్తాం అనుకోని ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆ కుటుంబానికి తీవ్ర విషాదం మిగిలింది.

 

ఇక పుష్ప 2 ను అభిమానులతో కలిసి చూడడానికి అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చాడు. తమ అభిమాన హీరోను చూడడానికి అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుకు వచ్చారు. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీ తేజ్ లు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే పోలీసులు వారిని రక్షించి విద్యానగర్ లోని దుర్గ భాయి దేశముఖ్ హాస్పిటల్ కు తరలించారు.

 

ఇక రేవతి అప్పటికే మృతి చెందగా, శ్రీ తేజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం బాలుడుకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ఈ ఘటన ఇండస్ట్రీలో సంచలనంగా మారారు. సినిమా కోసం వెళ్లి తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు భాస్కర్. అతనిపై అల్లు అర్జున్ అభిమానులు సానుభూతి చూపిస్తున్నారు. ఇక ఈ ఘటనపై ఇప్పటికే బన్నీ టీమ్ స్పందించింది. ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగడం ఎంతో దురదృష్టకరమని, వారి కుటుంబానికి అల్లు అర్జున్ టీమ్ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపింది.

 

ఇక తాజాగా పుష్ప 2 ను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సైతం ఈ ఘటనపై స్పందిస్తూ “గత రాత్రి స్క్రీనింగ్ సమయంలో జరిగిన విషాద సంఘటనతో మేము చాలా బాధపడ్డాము. ఆ కుటుంబం మరియు వైద్య చికిత్స పొందుతున్న చిన్న పిల్లవాడి ఆరోగ్యంగా బయటపడాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా నిలవడానికి, వారికి సాధ్యమైన అన్ని సహాయాన్ని అందించడానికి మేము రెడీగా ఉన్నాం” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ విషయమై ఇంకా బన్నీ డైరెక్ట్ గా మాట్లాడింది లేదు. మరి త్వరలోనే బన్నీ సైతం ఈ ఘటనపై స్పందిస్తాడేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *