అప్పుడో, ఇప్పుడో ప్రకటన వస్తుందనుకున్న వాలంటీర్లకు ఇది షాకిచ్చే న్యూస్ గా చెప్పవచ్చు. ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లు వరకు ఓకే కానీ, రాజీనామా చేయకుండా ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూపుల్లో ఉన్న వాలంటీర్లకు షాకిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సర్పంచ్ సంఘం నాయకులు గురువారం కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను వారు ఏకరువు పెట్టారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మాదిరిగా ఉందని, తమ సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. సర్పంచ్ సంఘం నాయకులతో మాట్లాడిన పవన్ వారికి గుడ్ న్యూస్ చెప్పారు.
ప్రభుత్వం పంచాయతీలకు అందించే నిధులు ఆపాలన్న ఉద్దేశంతో లేదని, 15 ఫైనాన్స్ డబ్బులు త్వరలోనే పంచాయతీల ఖాతాలలో జమ కానున్నట్లు తెలిపారు. గ్రామీణ అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి పైప్‌లైన్‌లో కూడా మార్పులు తెస్తామని, టెక్నికల్ లోపాలు సవరించే చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గ్రామాలకు నిధుల విడుదలపై ఆర్థిక శాఖతో మాట్లాడనున్నట్లు, ఉచిత విద్యుత్‌పై కేబినెట్‌లో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని సర్పంచ్ లతో పవన్ తెలిపారు.
ఇక సర్పంచ్ లు అడిగిన మరో ప్రశ్ననే ఇప్పుడు వాలంటీర్లకు చిక్కు తెచ్చిందని చెప్పవచ్చు. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలంటూ సర్పంచ్ లు పవన్ ను కోరారు. ఇక పవన్ ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. వాలంటీర్లు అసలు ఉద్యోగులే కాదని, వారికి ప్రభుత్వం తరఫున ఎటువంటి అపాయింట్ మెంట్ లేదన్నారు. వాలంటీర్ల వ్యవస్థ అని చెబుతున్నారని, అసలు అది ఏ వ్యవస్థలో కూడా లేదని కరాఖండిగా చెప్పారు. అయితే సీఎం చంద్రబాబుతో భేటీ తర్వాత, రాజీనామా చేయని వాలంటీర్లపై ఒక నిర్ణయం తీసుకుంటామని సర్పంచ్ లతో పవన్ చెప్పారు.
అయితే ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు కొందరు తమను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారని, అందుకే రాజీనామా చేసినట్లు రాజీనామా వాలంటీర్ల ఆవేదన. రాజీనామా చేయని వాలంటీర్లు మాత్రం ప్రభుత్వం ఇచ్చే ప్రకటన కోసం వేచి ఉన్న సమయంలో, పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా చేర్చుకోవాలని ఆ పార్టీ నేతలే ప్రకటించిన విషయాన్ని టీడీపీ ప్రచారం చేస్తోంది. ఏదిఏమైనా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా అన్నది, ప్రభుత్వ ప్రకటనతో వెల్లడి కావాల్సి ఉంది.