ఏపీలో కరెంట్ చార్జీలు పెరగబోతున్నాయని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కరెంటు చార్జీలు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పేదలపై విద్యుత్ భారానికి గత ప్రభుత్వమే కారణమని అన్నారు. నేడు అమరావతిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం నిర్మించిన 400/220 కే.వీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ ను చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఆయన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ రంగంపై 1.25 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిపారు.
1998 లోనే తాను విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చానని గుర్తు చేశారు. తలసరి కరెంటు వినియోగం పెంచాలని సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని అన్నారు. ప్రస్తుతం ఎలాంటి విద్యుత్ సమస్య లు లేకుండా అమరావతిలో సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అప్పట్లో ఇంటర్ నెట్ కు కూడా తానే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. ప్రస్తుతం ఫోన్ ప్రతిఒక్కరి దగ్గర ఉందని కానీ దాని గురించి కూడా తానే మొదటిసారి ప్రస్థావించానని అన్నారు. తన తరవాతనే అందరూ మాట్లాడారని అన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందిందని చెప్పారు. తిరుపతిలో తనపై యాక్సిడెంట్ జరిగిన నాడు టెక్నాలజీ లేదని కేవలం జెమినీ టీవీ మరో ఛానల్ మాత్రమే ఉన్నాయని చెప్పారు.
కానీ ఇప్పుడు మీడియాతో పాటూ సోషల్ మీడియా కూడా ఉందని అన్నారు. సోషల్ మీడియాకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. కుటుంబ సభ్యుల గురించి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని అన్నారు. తన కుటుంబాన్ని అసెంబ్లీలో దూషిస్తే మొట్టమొదటిసారి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని అన్నారు. ఒకప్పుడు విలువలు ఉండేవని ఇప్పుడు అవేమీ లేవని అన్నారు. అనిత ఓ అడబిడ్డ ఆమె గురించి, పవన్ పిల్లల గురించి కూడా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. మదం ఎక్కువై ఇలాత చేస్తున్నారని ఎవ్వరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.