పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు.. నేత ఇంటికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు..

బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాలను వికారాబాద్ జిల్లా మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. లగచర్లలో కలెక్టర్ వాహనం సహా అధికారులపై జరిగిన దాడి ఘటనలో ఏ1గా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారని ఆయన తెలిపారు.

 

లగచర్ల ఘటనలో మొదట 47 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారిలో 16 మందిని రిమాండ్‌కు తరలించామని చెప్పారు. బుధవారం మరో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మిగితా వారి కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయని ఐజీ సత్యనారాయణ వెల్లడించారు.

 

అధికారులను తప్పుదోవ పట్టించిన సురేశ్‌పై గతంలో కేసులున్నాయని ఆయన తెలిపారు. ఉన్నతాధికారులపై దాడి చేసిన వారిలో 19 మందికి భూమే లేదని వెల్లడించారు. కొందరికి భూమి ఉన్నా.. భూసేకరణ పరిధిలోకి వారి భూమి రాదన్నారు. నిందితులు హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నట్లు సమాచారం ఉందని తెలిపారు. చాలా మంది రైతులను విచారించి వదిలిపెట్టామని ఐజీ సత్యనారాయణ తెలిపారు.

 

పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు

 

లగచర్లలో ఉన్నతాధికారులపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బుధవారం కొడంగల్ కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. దీంతో నవంబర్ 27 వరకు ఆయన జైలులోనే ఉండనున్నారు. కాగా, నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

 

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర పన్నారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ముఖ్య నేతల ఆదేశాలతోనే దాడికి వ్యూహరచన చేసినట్లు వెల్లడించారు. నరేందర్ రెడ్డి నేరపూరిత కుట్ర రూపొందించాడని.. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడికి తెగబడ్డారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ ఘటనలో కీలకంగా వ్యవహరించిన సురేశ్‌కు తరచూ ఫోన్ చేసినట్లు నరేందర్ రెడ్డి అంగీకరించారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు.

 

కేటీఆర్ ఇంటికి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు

 

పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ప్రస్తావించడంతో.. ఆయనను అరెస్ట్ చేస్తారేమోననే ఆందోళనతో హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి బుధవారం అర్ధరాత్రి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. వారిని కలిసి అభివాదం చేశారు కేటీఆర్. దీంతో అక్కడ కొంత ఉద్వేగ వాతావరణం నెలకొంది.

 

మరోవైపు, ప్రభుత్వం చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టు భూసేకరణను వ్యతిరేకిస్తూ వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్‌‌పై జరిగిన దాడిని తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఇలాంటి హింస ప్రభుత్వ అధికారులు తమ విధులను నిర్వర్తించకుండా అడ్డుకోబోదని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *