తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్ద పీట వేయనుందా ? ప్రజా ప్రభుత్వం లక్ష్యం ఏంటి ? సంక్షేమం, అభివృద్ధిని రేవంత్ సర్కార్ జోడు ఏడ్లుగా పరుగులు పెట్టిస్తోందా ? ఈ జాబితాలో టూరిజం రంగాన్ని సైతం చేర్చనుందా అని అంటే మాత్రం సమాధానం అవుననే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చారిత్రాత్మక భవనాలకు తాము ప్రయారిటీ ఇస్తామంటున్నారు ప్రభుత్వాధినేత.
మెట్ల బావుల కోసం కదిలిన సర్కార్…
హైదరాబాద్ మహానగరంలోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సీఐఐతో పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు.
హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణలో భాగం కావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమంతో పాటే పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టిస్తామని స్పష్టం చేశారు.
ముసీని మారుస్తారట…
ఇందులో భాగంగానే మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని సైతం తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్య ఫలితమే ఎన్నో హిస్టారికల్ బిల్డింగ్స్ శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు.
మండలిని షిఫ్ట్ చేస్తున్నారట…
పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్దరించేందుకు నిర్ణయించామని, త్వరలోనే అక్కడ శాసనమండలి ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుత మండలి ఉన్న జూబ్లీహాల్’కు చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్పెషల్ టెక్నాలజీ ఉపయోగించి ఆ భవనాన్ని నిర్మించారన్నారు.
దాన్ని భవిష్యత్ తరాలకు సైతం అందించేందుకు కృషి చేస్తున్నామని, అందుకే జూబ్లీహాల్ ను దత్తత తీసుకుని పరిరక్షించాలని సీఐఐని కోరారు.
గోషామహల్ స్టేడియానికి పేదల దేవాలయం…
ఇక నైజాం కట్టడాల్లో మరో పురాతనమైనది ఉస్మానియా ఆస్పత్రి. ఈ భవనాన్ని సైతం పరిరక్షిస్తామన్నారు. అయితే ఆస్పత్రిని గోషామహల్ స్టేడియానికి తరలిస్తున్నామన్నారు.
హైకోర్టు భవనాన్ని కూడా కాపాడతాం…
ప్రస్తుత హైకోర్టు భవనం హెరిటేజ్ భవనంగా విరాజిల్లుతోందని, దీని పరిరక్షణలో భాగంగానే ఉన్నత న్యాయస్థానాన్ని సైతం తరలిస్తున్నామన్నారు. హైకోర్టు నూతన భవన నిర్మాణం కోసం రాజేంద్ర నగర్ ప్రాంతంలో దాదాపు 100 ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు.
హైదరాబాద్ సిటీ కాలేజ్ బిల్డింగ్ సహా పురానాపూల్ బ్రిడ్జి లాంటి చారిత్రక కట్టడాల పరిరక్షణకు నడుం బిగించాల్సిన అవసరాన్ని సీఎం నొక్కి చెప్పారు. ఈ జాబితాలో ఇప్పటికే 400 ఏళ్ల నాటి చార్మినార్ పరిరక్షణ ప్రాజెక్ట్ కొనసాగుతోందని గుర్తు చేశారు.
సీఎం మాటకు గ్రీన్ సిగ్నల్…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలకు పలువురు పారిశ్రామికవేత్తలు సానుకూలంగా స్పందించడమే కాదు పురాతన బావులను సైతం దత్తత తీసుకున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒప్పంద పత్రాలను సైతం అందజేయడం విశేషం.
ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్దరణకు మరో కార్పోరేట్ సంస్థ ఇన్పోసిస్ ముందుకు వచ్చింది. మంచిరేవుల మెట్ల బావిని సాయి లైఫ్ సంస్థ దత్తత తీసుకోగా, ఇక సాలార్ జంగ్, అమ్మపల్లి బావులను భారత్ బయోటెక్ సంస్థ పునరుద్దరించబోతోంది.
అడిక్‌మెట్ మెట్ల బావి, దొడ్ల డైరీ, ఫలక్ నుమా మెట్ల బావి టీజీఆర్టీసీ తీర్చిదిద్దనుంది. ఇక ప్రఖ్యాత రెసిడెన్సీ మెట్ల బావి పరిరక్షణ బాధ్యతను కోఠి ఉమెన్స్ కాలేజీ స్వీకరించింది.
ఫ్రీగా తెలంగాణ దర్శిని…
ప్రభుత్వ విద్యార్థులకు రేవంత్ సర్కార్ మరో అద్భుత కానుకను అందించింది. రాష్ట్రంలోని పర్యాటక, చారిత్రక ప్రాంతాలను ఉచితంగా సందర్శించే అవకాశం కల్పించింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మాటను వెల్లడించడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువకుంటున్న విద్యార్థులు సంబురపడుతున్నారు. ఈ పథకం పేరును తెలంగాణ దర్శినిగా అమలు చేస్తున్నారట. ఇందుకు సంబంధించిన జీఓను ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిందని రేవంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ ప్రసాద్, సీఐఐ తెలంగాణ ఛైర్మన్ సాయిప్రసాద్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఓఎస్డీ వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు