హైడ్రాపై హైకోర్టు కన్నెర్ర.. కమీషనర్ రంగనాథ్‌కు నోటీసులు..

హైడ్రా సంస్థపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే సోమవారం ఉ.10:30 గంటలకు హాజరవ్వాలని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

శనివారం నోటీస్… ఆదివారం కూల్చివేత…

 

సంగారెడ్డి జిల్లా పరిధిలోని అమీన్‌పూర్‌లో ఇటీవలే హైడ్రా అధికారులు ఓ భవనాన్ని కూల్చేశారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం, కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని ప్రశ్నించింది. ఈ ఘటనపై స్వయంగా కమిషనర్ రంగనాథ్, వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది.

 

హాస్పిటల్ నిర్మాణానికి ఐదు అంతస్థుల భవనం విచారణ కోర్టు పరిధిలో ఉందన్న న్యాయస్థానం, కూల్చివేతలు ప్రారంభించే ముందు నోటీసులు ఇచ్చారా అని ఆరా తీసింది. కాల వ్యవధి లేకుండా శనివారం నోటీసులిచ్చి ఆదివారం కూలగొట్టడం ఏంటని నిలదీసింది. కోర్టు స్టేఉన్నా ఎలా కూల్చివేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

మూసీ బెడ్ పై సర్వే…

 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, నాలాల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రాను ఏర్పాటు చేసింది.

సర్కారు ఆదేశాల ప్రకారం అక్రమ కట్టడాలపై హైడ్రా దుమ్ము దులుపుతోంది. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను ఎక్కడికక్కడే నేలపాలు చేస్తోంది.

 

మరోవైపు మూసీ రివర్ బెడ్ మీద రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. అది పూర్తయ్యాక కూల్చివేతలకు హైడ్రా దూసుకొస్తుందని నదీ పరివాహక ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. మూసీ నదీపై వేలాది ఆవాసాలున్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి ప్రభుత్వం తరఫున డబుల్ బెడ్రూం ఇళ్లు శాంక్షన్ చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్లను అలాటెడ్ ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సర్వే వేగం పెంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *