జమ్ము కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..

కేంద్ర ఎన్నికల సంఘం జమ్ము కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. జమ్ము కశ్మీర్‌లో మూడు దశలు, హర్యానాలో ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్, హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు.

 

జమ్ము కశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీన జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. అక్టోబర్ 1వ తేదీన హర్యానా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ 4వ తేదీన జమ్ము కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు.

 

జమ్ము కశ్మీర్‌లో 90 స్థానాలకు, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 370 అధికరణం రద్దు తర్వాత తొలిసారి జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. 3.71 లక్షల కశ్మీరీ పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

 

ఏప్రిల్ 19వ తేదీ నుంచి మే 20వ తేదీ మధ్య ఐదు విడతల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు పెద్ద మొత్తంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈ సందర్భంగా ఈసీ చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ గుర్తు చేశారు. జమ్ము కశ్మీర్‌లో 58.58 శాతం ఓటింగ నమోదైందని వివరించారు. ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారని చెప్పడానికే కాదు.. మార్పులో భాగస్వామ్యం కావాలని కూడా ఆరాటపడుతున్నట్టు లోక్ సభ ఎన్నికలను బట్టి చెప్పవచ్చని పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్‌లో ఇలాంటి మార్పులు సంతోషదాయకం అని, ఇది బుల్లెట్, బాయ్‌కాట్‌ల పై బ్యాలెట్‌ గెలుపుగా అభివర్ణించారు.

 

2019 ఆగస్టు 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏను రద్దు చేసింది. పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత జమ్ము కశ్మీర్‌లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ మొత్తంలో భద్రతా బలగాలు మోహరించాయి. కొన్ని నెలల వరకు జమ్ము కశ్మీర్ వాసులు అడుగు బయటపెట్టాలంటే వణికిపోయే పరిస్థితి నెలకొంది. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ ముఖ్యనాయకులను నెలలపాటు గృహనిర్బంధం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *