నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్.. ఐఎంఏ ప్రకటన..!

కోల్‌కతాలోని ఆకె కార్ మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ హత్యచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వైద్య విద్యార్థులపై ఆగస్టు 14న దాడులు జరిగాయి. దీంతో జాతీయ వైద్యుల సంఘం(ఇండియన్ మెడికల్ అసోసియేషన్ – ఐఎంఏ)  దేశవ్యాప్తంగా వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు గురువారం సాయంత్రం ప్రకటించింది.

 

”కోల్ కతా మహిళా డాక్టర్ హత్యాచారాన్ని ఐఎంఏ ఖండిస్తోంది. డాక్టర్లపై జరుగుతున్న దాడులను దేశ ప్రజలు అర్థం చేసుకోవాలని ఐఎంఏ కోరుకుంటోంది. అందుకే శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలపాటు ఔట్ పేషంట్ సేవలు నిలిపివేయబడతాయి. అన్ని అత్యవసర వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతాయి.” అని ప్రకటనలో ఐఎంఏ పేర్కొంది. ఆగస్టు 18 తరువాత నిరసనలు మరింత తీవ్రమయ్యే అవకాశముందని ఐఎంఏ తెలిపింది.

 

గోవాలో వేయి మంది డాక్టర్ల నిరసన

 

కోల్ కతా మహిళా డాక్టర్ హత్యాచార కేసులో సత్వర విచారణ జరగాలని డిమాండ్ చేస్తూ.. గోవాలో వేయి మంది ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు నిరసన చేస్తున్నట్లు తెలిపారు. శనివారం ఆగస్టు 17 ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలపాటు ఓపిడి (ఔట్ పేషెంట్ వైద్య సేవలు) నిలిపివేస్తున్నట్లు చెప్పారు.

 

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గోవా శాఖ అధ్యక్షుడు డాక్టర్ సందేశ్ చోడంకర్ మీడియాతో మాట్లాడుతూ.. ”గోవాలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 24 గంటల పాటు ఓపిడి సేవలు నిలిపివేస్తున్నాం. ఈ నిరసనలో గోవాకు చెందిన వేయి మంది డాక్టర్లు పాల్గొంటున్నారు. ఆస్పత్రులలో పనిచేసే సహాయక సిబ్బందిని కూడా ఈ నిరసనలో పాల్గొనాలని కోరుతున్నాం. గోవాలోని అన్ని ఆస్పత్రుల డాక్టర్లు ఓపిడి సేవలు నిలిపివేయాలని ఆదేశిస్తున్నాం. కోల్‌కతాలో జరిగిన పైశాచిక ఘటనలో కేవలం ఒక డాక్టర్ మాత్రమే చనిపోలేదు. ఉద్యోగం చేస్తున్న ఓ మహిళపై జరిగిన దాడి ఇది. వైద్య రంగంతో పాటు ఇతర రంగాల్లో పనిచేసే వారు కూడా ఈ నిరసనకు మద్దతు తెలపాలి. కోల్ కతాలో చనిపోయిన మహిళా డాక్టర్‌కు వెంటనే న్యాయం జరగాలి. ఆమె కుటుంబానికి తగిన ఆర్థిక సాయం అందించాలి. అన్నింటికి కంటే ముఖ్యంగా దోషులకు అత్యంత కఠిన శిక్షలు పడాలి. ఒక మహిళా డాక్టర్ పైశాచిక హత్య ఘటనకు వ్యతిరేకంగా ఐఎంఏ నిరసన చర్యలు ఆమెకు న్యాయం జరగాలని పోరాటంలో ఓ కనీస చర్య మాత్రమే.” అని అన్నారు.

 

డాక్టర్లకు భద్రత కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని.. వైద్య సిబ్బంది తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఆస్పత్రులను సేఫ్ జోన్ లుగా చేయాలని ఐఎంఏ డిమాండ్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *