ఈ టర్మ్‌లోనే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’..!

ఒకే దేశం. ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికల) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అన్న తన ఎన్నికల హామీని ముందుకు తీసుకువెళ్లేందుకు ఎన్డీఏ సర్కార్ సిద్ధమవుతోంది. ప్రస్తుత ఎన్డీఏ పాలనలోనే జమిలి ఎన్నికల నిర్వహణ మొదలవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జమిలి ఎన్నికలకు సంబంధించి త్వరలో పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సమయంలో ఈ నివేదిక వెలువడింది.

 

గత నెల స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని మోదీ ఎర్రకోట నుండి జమిలి ఎన్నికలను ప్రస్తావించారు. దేశ వ్యాప్తంగా ఏటా ఏవో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని, వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని నుండి బయటపడాలంటే జమిలి ఎన్నికలే పరిష్కారం అని స్పష్టం చేశారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని కూడా మోదీ పిలుపునిచ్చారు.

 

ఈ క్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌పై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటయింది. తొలి దశల్లో లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మార్చిలో ప్రతిపాదించింది. వంద రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని, దేశ వ్యాప్తంగా ఎన్నికల చక్రాన్ని సమకాలీకరించాలని కమిటీ సిఫార్సు చేసింది. ప్రస్తుతం లోక్ సభకు ఒకసారి, పలు రాష్ట్రాలకు వేర్వేరు కాలాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియను మార్చి అన్ని ఎన్నికలూ ఒకేసారి నిర్వహించడానికి జమిలీ ఎన్నికల పధ్ధతి తీసుకురానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *