సౌత్‌కొరియాలో సీఎం రేవంత్ టీమ్.. హ్యుందాయ్ కారు టెస్టింగ్ సెంటర్‌కు గ్రీన్‌సిగ్నల్..

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి సౌత్‌కొరియాలో పర్యటిస్తు న్నారు. ఆ దేశంలోని పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా హ్యుందాయ్ మోటార్ కంపెనీ కారు టెస్టింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.

 

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా కంపెనీలు ముందుకొస్తున్నాయి. సోమవారం అమెరికా నుంచి సౌత్ కొరియాకు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, అక్కడి వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో మెగా కారు టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు హ్యుందాయ్ కార్ల కంపెనీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు ఎలక్ట్రికల్ వాహనాలు సహా అత్యాధునిక టెస్టింగ్ సదుపాయాలు ఉండేలా ప్లాన్ చేస్తోంది.

 

సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణలో బిజినెస్ చేసేందుకు హెచ్ఎంఐఈ వంటి కంపెనీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. వినియోగదారుల కోసం బెంచ్‌మార్క్ ఉత్పత్తుల తోపాటు సాంకేతిక అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని హ్యుందాయ్ కంపెనీ సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు.

 

ఇందులోభాగంగా పలు కొరియన్ కంపెనీలు వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. కొరియాకు చెందిన 25 టెక్స్ టైల్ కంపెనీల అధిపతులతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం అని వివరించారు. చాలామంది పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపారు. వీలు చూసుకుని అక్కడి నుంచి వివిధ కంపెనీల ప్రతినిధుల బృందం తెలంగాణలో పర్యటించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *