సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం, ప్రతి పనికి టెక్నాలజీనే వినియోగించడంతో ఇది అదీ అని తేడా లేకుండా అన్నింటా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. మీకు ఫ్రీ గిఫ్ట్ వచ్చిందని బురీడీ కొట్టించే వాడు ఒకడైతే.. పెళ్లి సంబంధాలు అంటూ మోసం చేసేవాడు మరొకడు. నేరగాళ్లు విదేశాల్లో ఉంటూ సైబర్ మోసాలకు పాల్పడటంతో వారిని గుర్తించడం, పట్టుకోవడం పోలీసులకు కత్తిమీదసాములా తయారైంది. ఇక ఇప్పుడు ప్రభుత్వ పథకాలు, సర్వేలతోనూ కేటుగాళ్లు దోచుకోవడం మొదలు పెట్టారు.
తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఇంటింటి సర్వే చేపడుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సర్వే పేరుతో కేటుగాళ్లు లింక్ పంపి బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఈ మోసాల బారిన పడకుండా ఎలా ఉండాలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కొన్ని సూచనలు చేశారు. కుటుంబ సర్వే పేరుతో మొబైల్ ఫోన్ కు ఎలాంటి లింక్ వచ్చినా ఓపెన్ చేయవద్దని సూచించారు. ఒకవేళ ఈ లింక్స్ నిజమే అనుకుని క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలోని డబ్బులు మొత్తం కాజేస్తారని హెచ్చరించారు.
అంతే కాకుండా సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఎలాంటి లింక్ వచ్చినా స్పందించకూడదని పోలీసులు చెబుతున్నారు. సర్వే కోసం ఫోన్ చేశామని చెప్పి ఓటీపీ అడిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పవద్దని తెలిపారు. రాష్ట్రంలో ఈనెల 6 నుండి తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైందని, అధికారులు మరియు ప్రభుత్వ సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేసుకుని వెళతారని స్పష్టం చేశారు. ఫోన్ ద్వారా, ఆన్ లైన్ లింకుల ద్వారా సర్వే చేయడం లేదని చెప్పారు. ఈ సర్వే పేరుతో ఏదైనా లింక్ కానీ ఫోన్ కాల్ కానీ వస్తే స్పందించవద్దని సూచించారు.