ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పర్యాటకరంగాన్ని భారీగా ప్రోత్సహించేలా అడుగులు వేస్తోంది. ఆధ్యాత్మిక పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంద.
ఈ క్రమంలో సరికొత్తగా సీప్లేన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి కర్నూలు జిల్లా శ్రీశైలం వరకూ కృష్ణానదిపై ఈ సీప్లేన్‌ను నడిపించోబోతోంది. దీనికి సంబంధించిన మొట్టమొదటి ట్రయల్ రన్ విజయవంతంగా ముగిసింది. పున్నమి ఘాట్ నుంచి బయలుదేరిన ఈ సీప్లేన్.. శ్రీశైలానికి చేరుకుంది.
ప్రకాశం బ్యారేజీ పున్నమి ఘాట్ వద్ద శనివారం ఉదయం చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సీప్లేన్ ట్రయల్ రన్‌ను లాంఛనప్రాయంగా ప్రారంభించనున్నారు. అనంతరం చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు సీప్లెయిన్‌లో ప్రయాణం చేయనున్నారు.
శ్రీశైలానికి చేరుకున్న అనంతరం వారిద్దరూ శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకుంటారు. మళ్లీ అదే సీప్లేన్‌లో పున్నమి ఘాట్‌కు చేరుకుంటారు. 1,000 మంది ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా పున్నమి ఘాట్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎన్టీఆర్ జిల్లా అధికారులు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, జిల్లాలకు చెందన ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొననున్నారు. డీహవ్‌లాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన సీప్లేన్ ఇది. మొత్తం 14 మంది ఇందులో ప్రయాణించే సామర్థ్యం ఉంది. ట్రయల్ రన్ విజయవంతమైన తరువాత కమర్షియల్ ఆపరేషన్స్ కోసం దీన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకుని వస్తారు.
ఈ సీప్లేన్ కోసం ప్రకాశం బ్యారేజీ పున్నమి ఘాట్, శ్రీశైలం రిజర్వాయర్‌లో పాతాళగంగ బోటింగ్ పాయింట్ వద్ద ప్రత్యేకంగా ఫ్లోటింగ్ జెట్టీలను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే ఇది టేకాఫ్, ల్యాండింగ్ తీసుకుంటుంది. విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.