గుంటూరు బాలిక అదృశ్యం.. ఏపీ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం!

గుంటూరులో పదో తరగతి చదువుతున్న బాలిక అదృశ్యమై 80 రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేసు విచారణలో భాగంగా బాలికను ఇవాళ ధర్మాసనం ముందు హాజరుపరచాలని డీజీపీని ఆదేశించినప్పటికీ.. పోలీసులు ఆమెను కోర్టు ముందు హాజరుపరచలేకపోయారు. దీంతో డీజీపీకి తాము ఇచ్చిన ఆదేశాలు అర్థమవుతున్నాయా లేదా అంటూ ధర్మాసనం తీవ్రంగా ప్రశ్నించింది.

బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. అయితే సిట్ ఏర్పాటు చేశారంటే గుంటూరు పట్టాభిపురం పోలీసులు బాలికను గుర్తించడంలో విఫలమైనట్లేనా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆచూకీ కనిపెట్టడంలో విఫలమైన అధికారులనే సిట్‌లో నియమిస్తే ప్రయోజనం ఏముంటుందని ప్రభుత్వాన్ని నిలదీసింది.

బాలిక ఆచూకీ కోసం ఏర్పాటు చేసిన తొమ్మిది మంది సభ్యుల సిట్‌లో ఏడుగురు ఇప్పటికే దర్యాప్తులో విఫలమైన అధికారులేనని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును ఛేదించడంలో విఫలమైన అధికారులకే మళ్లీ బాధ్యతలు అప్పగించడం సరైన విధానం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బాలిక ఆచూకీ కోసం పోలీసులు మరింత సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది.