తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల వేడి మరింత పెరిగింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ప్రత్యర్థి ప్యానెల్‌పై, నిర్మాత అశోక్ కుమార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తమ ప్యానెల్ ఎంతో హుందాగా ఎన్నికల బరిలో ముందుకు వెళ్తుంటే.. కావాలనే ప్రెస్‌మీట్ పెట్టి తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
అశోక్ కుమార్ నామినేషన్ వ్యవహారంపై స్పందించిన చదలవాడ.. కనీస అనుభవం లేకుండా ఒకేసారి మూడు నామినేషన్లు వేశారని అన్నారు. నిబంధనల ప్రకారం నామినేషన్లను సమయానికి విత్‌డ్రా చేసుకోకపోవడం వల్లే ఆయన నామినేషన్ అనర్హతకు గురైందని, ఇందులో తమ ప్యానెల్ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. కోర్టు మెట్లు ఎక్కడాన్ని తప్పుబట్టిన ఆయన.. పరిశ్రమకు గౌరవం ఇస్తూ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అశోక్ కుమార్‌కు సూచించారు.
సినిమా నిర్మాత కష్టం పొలంలో కష్టపడే రైతు కష్టంతో సమానమని చదలవాడ అభివర్ణించారు. రెగ్యులర్‌గా సినిమాలు తీస్తూ పరిశ్రమలో కొనసాగుతున్న తమ ప్యానెల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యర్థి ప్యానెల్‌కు పదవులు కావాల్సింది నిర్మాతల సమస్యలు పరిష్కరించడానికి కాదని, ముఖ్యమంత్రుల పక్కన నిలబడి ఫొటోలు దిగుతూ ప్రచారం చేసుకోవడానికేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దివంగత దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు ఆశయాలను అనుసరిస్తున్న తమ ప్యానెల్‌కు ఓటు వేసి గెలిపించాలని నిర్మాతలను కోరారు.