అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో (జీజీహెచ్) చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. చికిత్స పొందుతున్న 58 రోజుల చిన్నారిని ఆమె నానమ్మ ఆసుపత్రి పై అంతస్తు నుంచి కింద ఉన్న కాలువలో పడేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదృష్టవశాత్తూ కాలువలో ఉన్న ఖాళీ వాటర్ బాటిళ్లపై చిన్నారి పడటంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.
శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలానికి చెందిన పూజిత, అశోక్ కుమార్ దంపతుల 58 రోజుల కుమార్తెకు ఫిట్స్ రావడంతో ఈ నెల 22న అనంతపురం జీజీహెచ్‌లో చేర్పించారు. వైద్యులు పీడియాట్రిక్ వార్డులో చికిత్స అందిస్తుండగా, ఈ నెల 27 రాత్రి చిన్నారి నానమ్మ సత్యమ్మ ఆమెను వార్డు నుంచి బయటకు తీసుకెళ్లినట్లు సమాచారం.
కొంతసేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం చిన్నారి ఆసుపత్రి భవనం కింద ఉన్న కాలువలో సజీవంగా కనిపించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, ఈ ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.