టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవికి వీడ్కోలు పలికిన మరుసటి రోజే ర్యాన్ టెన్ డస్కాటెకు కొత్త బాధ్యతలు దక్కాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ ఆయనను హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ బాధ్యతల్లో భాగంగా నైట్ రైడర్స్ గ్లోబల్ క్రికెట్ వ్యవస్థలో కీలక పాత్ర పోషించనున్నారు.
కేకేఆర్ వెల్లడించిన వివరాల ప్రకారం, డస్కాటె ఆటగాళ్ల స్కౌటింగ్, కొత్త ప్రతిభావంతుల ఎంపిక, జట్టు వ్యూహాలు రూపొందించడం, టాలెంట్ డెవలప్మెంట్, ప్రదర్శన విశ్లేషణ వంటి కీలక విభాగాలను పర్యవేక్షించనున్నారు. అలాగే నైట్ రైడర్స్‌కు చెందిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఫ్రాంచైజీల కోచింగ్ బృందాలతో సమన్వయంగా పనిచేయనున్నారు.
అదనంగా కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, ఐఎల్టీ20లో అబుదాబి నైట్ రైడర్స్, మేజర్ లీగ్ క్రికెట్లో లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ జట్లకు అసిస్టెంట్ కోచ్‌గా కూడా సేవలందించనున్నారు. డస్కాటె అనుభవం నైట్ రైడర్స్ గ్లోబల్ క్రికెట్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ఫ్రాంచైజీ ఆశాభావం వ్యక్తం చేసింది.